Telangana: ముహూర్తం కుదిరింది... అసెంబ్లీ ఎన్నికలకు 12న షెడ్యూల్!

  • నాలుగు రాష్ట్రాలతో పాటే తెలంగాణకు ఎన్నికలు
  • నవంబర్ 11 నుంచి 30 మధ్య పోలింగ్
  • డిసెంబర్ తొలి వారంలో ఫలితాల వెల్లడి

తెలంగాణ ముందస్తు ఎన్నికలకు ముహూర్తం కుదిరినట్టు తెలుస్తోంది. నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటే తెలంగాణ ఎన్నికలనూ జరిపించాలని ఎన్నికల సంఘం నిర్ణయించుకుందని సమాచారం. ఇప్పటికే కసరత్తు పూర్తి చేసిన ఈసీ, ఈ నెల 12న షెడ్యూల్ వెలువరిస్తుందని, నవంబర్ 11 నుంచి 30 మధ్య అన్ని రాష్ట్రాల ఎన్నికలూ జరుగుతాయని ఈసీ వర్గాలు అంటున్నాయి. మావోయిస్టుల ప్రభావం అధికంగా ఉండే ఛత్తీస్ గఢ్ మినహా మిగతా అన్ని రాష్ట్రాల్లో ఒకే రోజున పోలింగ్ జరుగుతుందని, ఐదు రోజుల వ్యవధిలో ఎన్నికలు ఉంటాయని, డిసెంబర్ తొలి వారంలో ఫలితాలు వెలువడతాయని అధికారులు అంటున్నారు.

నవంబర్ 11 నుంచి 17 మధ్య రెండు దశల్లో తెలంగాణ, మిజోరం ఎన్నికలు జరుగుతాయని, అదే నెల 18 నుంచి 24 మధ్య మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, 25 నుంచి 30 మధ్య రాజస్థాన్ లో పోలింగ్ జరుగుతుందని అధికారులు అంటున్నారు. ఇప్పటికే ఈవీఎంలు, వీవీప్యాట్ మెషీన్లు సిద్ధమయ్యాయని, వీటిపై రాజకీయ పార్టీలకు అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టామని సీనియర్ అధికారులు తెలిపారు. డిసెంబర్ 10 నాటికి అన్ని రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు ఏర్పడేందుకు తమవంతు సహకారాన్ని అందించాలని భావిస్తున్నట్టు వెల్లడించారు.

  • Loading...

More Telugu News