apcc: ఏపీలో రైతులకు సబ్సిడీపై ఎరువులు విక్రయించాలి: కాంగ్రెస్ నేత కొలనుకొండ శివాజీ
- ఎరువుల ధరలపై నియంత్రణ ఏది?
- వ్యాపారులు రైతులను మోసం చేస్తున్నారు
- ధాన్యం కొనుగోలు కేంద్రాలు గోల్‌మాల్‌గా మారాయి
రాష్ట్రంలో రసాయనిక ఎరువుల ధరలు విచ్చలవిడిగా పెరిగిపోతున్నా రాష్ట్ర ప్రభుత్వం చోద్యం చూస్తోందని ఏఐసీసీ సభ్యుడు, ఏపీసీసీ అధికార ప్రతినిధి కొలనుకొండ శివాజీ అన్నారు. రైతులకు దన్నుగా నిలిచేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యలు శూన్యమని, మెట్ట, మాగాణి పంటలకు యూరియా తర్వాత అధికంగా వినియోగించే డిఏపీ బస్తా రూ.1500కు చేరుకుంటోందని విమర్శించారు. గడచిన ఆరునెలల్లోనే డీఏపీ ఒక్కో బస్తాపై రూ.400, పొటాష్పై రూ.350 వరకు ధరలు పెరిగాయంటే పరిస్థితి ఎంత ఘోరంగా వుందో అర్థం చేసుకోవచ్చని అన్నారు.
ప్రభుత్వ నిర్లక్ష్యంతో వ్యాపారులు రైతులను మోసం చేస్తున్నారని, పాత స్టాకును సైతం కొత్త ధరలకే అంట గడుతున్నారని, వ్యాపారులు చెప్పిందే ధరగా మారిపోయిందని మండిపడ్డారు. ఇప్పటికే వాతావరణ పరిస్థితులు అనుకూలించక రైతులు ఖరీఫ్‌పై ఆందోళన చెందుతున్నారని, పెట్టుబడులకు బ్యాంకుల నుంచి రుణాలు అందక అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి మరీ పంటలు సాగు చేస్తున్నా పండించిన పంటకు గిట్టుబాటు ధర రావడం లేదని అన్నారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాలు గోల్మాల్ కేంద్రాలుగా మారి.. చివరకు దళారులకే తెగనమ్ముకుంటున్నారని, పైరుకు ఎరువులు అవసరమైన దశలో వాటి ధరలు ఆకాశాన్నంటడం రైతులకు పెను భారంగా పరిణమించిందని అన్నారు. ఈ లెక్కన రైతులు అప్పుల పాలవడం మినహా పెట్టిన పెట్టుబడి కూడా చేతికందే అవకాశం లేదని, వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తామని ప్రగల్బాలు పలికిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా మొద్దు నిద్ర వీడి, తక్షణమే ఎరువుల ధరల తగ్గింపునకు చర్యలు చేపట్టాలని శివాజీ డిమాండ్ చేశారు.
ప్రధానంగా డీఏపీ, పొటాష్లను సబ్సిడీ ధరలకు రైతులకు అందే విధంగా చర్యలు తీసుకోవాలని, ఎప్పటికప్పుడు ఎరువుల దుకాణాల్లో తనిఖీలు నిర్వహించి, అవకతవకలను అరికటాక్టలని, వ్యాపారుల మాయాజాలంలో చిక్కు కోకుండా వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు అవగాహన కల్పించాలని కోరారు.