kama reddy district: కామారెడ్డిలో దోపిడీ దొంగల బీభత్సం.. మత్తుమందు ఇచ్చి ఏకంగా ఇల్లు లూటీ!
- డోసేజీ ఎక్కువ కావడంతో భర్త దుర్మరణం
- అద్దె పేరుతో ఇంటిలోకి దిగి దారుణం
- గాలింపు చేపట్టిన పోలీసులు
అద్దెకు దిగిన ఇంటికే కొందరు దుండగులు కన్నమేశారు. అర్ధరాత్రి పూట వృద్ధ దంపతులకు మత్తు మందు ఇచ్చి ఇంట్లోని సొత్తంతా దోచేశారు. అనంతరం ఘటనాస్థలి నుంచి పరారయ్యారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డి బీసీ కాలనీలో నిన్న అర్ధరాత్రి చోటుచేసుకుంది.
బీసీ కాలనీలో ప్రస్తుతం వృద్ధ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరు ఒంటరిగా ఉంటున్నట్లు గమనించిన కొందరు దుండగులు పక్కా ప్రణాళికతో అద్దెకు ఇల్లు కావాలంటూ వచ్చారు. మంచిగా నటిస్తూ పరిచయం పెంచుకున్నారు. నిన్న అర్ధరాత్రి ఒక్కసారిగా ఇంట్లోకి చొరబడి భార్యాభర్తలపై దాడిచేశారు. వారికి మత్తుమందు కలిపిన కల్లు ఇచ్చి బలవంతంగా తాగించారు. అనంతరం ఇంట్లోని బంగారం, నగదు, ఖరీదైన వస్తువులను దోచుకుని పరారయ్యారు. అయితే ఈ రోజు మధ్యాహ్నం మెలకువ వచ్చిన వృద్ధురాలు.. తన భర్త అచేతనంగా పడిపోయి ఉండటాన్ని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చింది.
దీంతో హుటాహుటిన ఆయన్ను ఆసుపత్రికి తరలించగా, అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తేల్చారు. కాగా బాధితురాలిని స్థానికంగా ఉండే ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందజేస్తున్నారు. ఈ విషయమై పోలీస్ ఉన్నతాధికారి ఒకరు స్పందిస్తూ.. దోపిడీ దొంగలను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని తెలిపారు. మత్తు డోసేజీ అధికం కావడం కారణంగానే భర్త చనిపోయినట్లు భావిస్తున్నామని చెప్పారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టంకు తరలించామని పేర్కొన్నారు.