Chandrababu: చంద్రబాబు ఇప్పుడు ఎన్టీఆర్ కు రెండో వెన్నుపోటు పొడిచారు: కేటీఆర్ విమర్శలు

  • నాడు పదవి కోసం వెన్నుపోటు పొడిచారు
  • నేడు కాంగ్రెస్ తో కలిసి రెండో వెన్నుపోటు
  • కాంగ్రెస్ పార్టీకి టీడీపీ తోక పార్టీగా మారింది

నాడు పదవి కోసం ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు, నేడు కాంగ్రెస్ తో కలిసి ఎన్టీఆర్ ఆత్మకు రెండో వెన్నుపోటు పొడిచారని కేటీఆర్ విమర్శలు చేశారు. కరీంనగర్ జిల్లాకు చెందిన బీజేపీ నేత విజేందర్ రెడ్డి, ఆయన అనుచరులు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీని బంగాళాఖాతంలో కలిపేందుకే టీడీపీని ఏర్పాటు చేశానని నాడు ఎన్టీఆర్ చెప్పారని, అటువంటి కాంగ్రెస్ పార్టీకి టీడీపీ తోక పార్టీగా మారిందని విమర్శించారు.

‘‘ఐదు సీట్లివ్వు..పది సీట్లివ్వు.. పదిహేను సీట్లివ్వు’ అంటూ  కాంగ్రెస్ పార్టీని ‘భిక్షాందేహి’ అంటూ అడుక్కుతినే పరిస్థితిని టీడీపీకి తీసుకొచ్చారు. ఎన్టీఆర్ ఆత్మకు రెండోసారి వెన్నుపోటు పొడిచిన నాయకుడెవరైనా ఉన్నారంటే చంద్రబాబునాయుడే’ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గతంలో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేసిన కాంగ్రెస్, టీడీపీ లు తాము గెలిచిన సీట్లను ‘ఏక్ దో తీన్’ అని లెక్కపెట్టుకున్నాయని విమర్శించారు.

కేసీఆర్ ని గద్దె దించాలన్నదే కాంగ్రెస్ పార్టీ స్లోగన్ అని, ఆ పార్టీ చెప్పే బూటకపు హామీలు నెరవేర్చాలంటే మొత్తం దక్షిణ భారతదేశం బడ్జెట్ కూడా సరిపోదని విమర్శించారు. రాహుల్ గాంధీ మొహం చూసి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసేవాళ్లు కూడా వేయరని ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ ఎక్కడ కాలు పెడితే అక్కడ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం ఆనవాయితీ అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. సీఎం కేసీఆర్ పై ప్రజల్లో బలమైన విశ్వాసం ఉందని, పాలేరు, నారాయణఖేడ్ ఉపఎన్నికల తీర్పే కేసీఆర్ పై నమ్మకానికి నిదర్శనమని కేటీఆర్ అన్నారు.

కేంద్రంలో వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమే 

ప్రధాని మోదీ ప్రతిష్ట రోజురోజుకీ మసకబారుతోందని కేటీఆర్ విమర్శించారు. దేశంలోని పేదల కోసం ఎన్డీఏ సర్కార్ చేసిందేమీ లేదని, విభజన చట్టంలో పేర్కొన్న చాలా అంశాలను కేంద్రం నెరవేర్చలేదని విమర్శించారు. మొదటి తొమ్మిది నెలలు ప్రధాని మోదీ ఒక్క ఫైల్ మీద సంతకం పెట్టలేదని అన్నారు. రాబోయే కాలంలో కేంద్రంలో వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమేనని జోస్యం చెప్పారు.

  • Loading...

More Telugu News