Revanth Reddy: రేవంత్ రెడ్డిపై ఫిర్యాదు చేసింది స్టీఫెన్ సన్ చిరకాల మిత్రుడే!
- తాను కేసు పెట్టడం వెనుక రాజకీయ కుట్ర లేదన్న రామారావు
- జూలై 24న రేవంత్ పై సీబీఐకి ఫిర్యాదు చేశా
- 300 నుంచి 400 కోట్ల అక్రమ ధనాన్ని కూడబెట్టారు
కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి నివాసాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. న్యాయవాది రామారావు ఫిర్యాదు మేరకు ఐటీ, ఈడీ అధికారులు ఈ సోదాలను నిర్వహిస్తున్నారు. ఓటుకు నోటు కేసుతో ఒక్కసారిగా పాప్యులర్ అయిన టీఆర్ఎస్ నేత స్టీఫెన్ సన్ కు చిరకాల మిత్రుడే రామారావు. ఈ విషయాన్ని ఆయనే ఈ రోజు హైదరాబాదు, సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడుతూ చెప్పారు.
రేవంత్ పై ఫిర్యాదు చేయడం వెనుక ఎలాంటి రాజకీయ కుట్ర లేదని చెప్పారు. గతంలో ఓ ఫిర్యాదుదారుడు తన వద్దకు వచ్చారని... అప్పటి నుంచి తాను రేవంత్ కంపెనీలపై దృష్టి సారించానని తెలిపారు. జూలై 24న రేవంత్ గురించి సీబీఐకి ఫిర్యాదు చేశానని చెప్పారు.
19 డొల్ల సంస్థల ద్వారా రేవంత్ సుమారు రూ. 300 నుంచి 400 కోట్ల మేర అక్రమ ధనాన్ని కూడబెట్టారని రామారావు తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న సోదాల్లో లెక్కలేనన్ని ఆస్తులు బయటపడ్డాయని చెప్పారు. 15 రోజుల క్రితమే రేవంత్ కు ఈడీ నోటీసులు ఇచ్చినా ఆయన స్పందించలేదని అన్నారు. అందుకే ఇప్పుడు సోదాలు జరుగుతున్నాయని చెప్పారు. మీపై 32 కేసులు ఉన్నాయట కదా? అనే మీడియా ప్రశ్నకు స్పందించేందుకు మాత్రం ఆయన నిరాకరించారు.