araku: అరకులో మరో కలకలం.. టీడీపీ నేతలను చంపేందుకు యత్నించిన మావోయిస్టులు!
- అరకుకు నాలుగు కిలోమీటర్ల దూరంలోని బెంజిపూర్ కు వెళ్లిన మావోలు
- అప్పాలు, అరుణకుమారిల ఇళ్లు ఎక్కడ అంటూ ఓ యువకుడిని ప్రశ్నించిన వైనం
- తనకు ఎవరూ తెలియదంటూ తప్పించుకున్న యువకుడు
అరకులో ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను హత్య చేసి తమ ఉనికిని చాటుకున్న మావోయిస్టులు... మరి కొందరు నేతలను కూడా టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. అరకు, డుంబ్రిగూడ పరిసరాల్లో పోలీసులు కూంబింగ్ జరుపుతున్నా లెక్కచేయని మావోయిస్టులు... నిన్న రాత్రి 8 గంటల సమయంలో అరకులోయకు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న బెంజిపూర్ కు వెళ్లారు.
అక్కడ రోడ్డుపక్కన నిల్చొని ఉన్న ఓ యువకుడి వద్దకు ముగ్గురు మావోయిస్టులు వెళ్లారు. వీరిలో ఇద్దరు మహిళలు ఉన్నారు. అరకు ఎంపీపీ అరుణకుమారి, టీడీపీ నేత అప్పాలు ఇళ్లు ఎక్కడో తెలుసా? అని అతన్ని ప్రశ్నించారు. వారి వద్ద ఆయుధాలు ఉండటంతో... తన ముందు ఉన్నవారు మావోయిస్టులు అనే విషయం అతనికి అర్థమైంది. ఇక్కడ తనకు ఎవరూ తెలియదని చెప్పి, అక్కడి నుంచి జారుకున్నాడు. వెంటనే అతను అప్పాలు ఇంటికి వెళ్లాడు.
ముచ్చెమటలతో, ఆందోళనగా తమ ఇంటికి వచ్చిన యువకుడని చూసి, ఏమైందంటూ అప్పాలు, అతని భార్య అరుణకుమారి ప్రశ్నించారు. మీ కోసం మావోయిస్టులు వచ్చారని, వెంటనే పారిపోవాలని సదరు యువకుడు హెచ్చరించాడు. వెంటనే వారు పోలీసులకు ఫోన్ చేశారు. దీంతో, ఏఎస్పీ రస్తోగి, అరకు సీఐ వెంకటనాయుడు హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. జరిగిన విషయం తెలుసుకుని అప్పాలు, అరుణకుమారి, సమాచారం అందించిన యువకుడిని తమతో పాటు అరకుకు తీసుకెళ్లారు.
ఈ సందర్భంగా మీడియాతో అరుణకుమారి మాట్లాడుతూ, కిడారిని చంపినప్పుడు కూడా మావోయిస్టులు తమ గురించి ఆరా తీశారని భయాందోళనలు వ్యక్తం చేశారు. పోలీసులు తమకు రక్షణ కల్పించాలని కోరారు.