Telangana: తమ నాయకుడిని కాపాడుకోవాలన్న కులగజ్జితోనే రేవంత్ పై సానుభూతి స్టోరీలు!: వైసీపీ నేత భూమన
- రేవంత్ పై ఐటీ దాడుల్లో బయటపడ్డ సొమ్ము ఎవరిది
- ఎవరిని కాపాడేందుకు సానుభూతి స్టోరీలు వేశారు
- చంద్రబాబుకు న్యాయ వ్యవస్థపై ఏమాత్రం గౌరవం లేదు
తెలంగాణ కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి నివాసాలపై జరుగుతున్న దాడుల్లో బయటపడుతున్న సొమ్ము ఆయనదేనా? లేక చంద్రబాబుదా? అని వైసీపీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ, ఈడీ అధికారులు తనిఖీలు చేపట్టగానే పచ్చ మీడియా ‘రేవంత్ పై పంజా’ ‘భావోద్వేగానికి లోనైన రేవంత్’ అంటూ సానుభూతి కథనాలను వండిందని విమర్శించారు. ఓటుకు నోటు కేసులో డైరెక్టుగా దొరికిన దొంగను హీరోగా చూపడం వెనుక రహస్యం ఏంటని భూమన ప్రశ్నించారు. హైదరాబాద్ లో ఈ రోజు పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
కేవలం తమ నాయకుడిని కాపాడుకోవాలన్న కులగజ్జి కారణంగానే ఎల్లో మీడియా అనుకూల కథనాలను ప్రసారం చేసిందని భూమన అన్నారు. ఏపీ, తెలంగాణలో చట్టం, న్యాయం, రాజ్యాంగం అమలుకావడం లేదని వ్యాఖ్యానించారు. ఓటుకు నోటు కేసులో ఇప్పటివరకూ తెలంగాణ పోలీసులు చంద్రబాబును విచారణకు ఎందుకు పిలవలేదని ప్రశ్నించారు.
అసలు సూత్రధారిని మూడేళ్ల పాటు వదిలేసి పాత్రధారిపై దాడులెందుకు జరుగుతున్నాయని అడిగారు. చంద్రబాబు భార్య భువనేశ్వరి పేరుపై రూ.1,200 కోట్లు, మంత్రి లోకేశ్ పేరుపై రూ.500 కోట్లు ఉన్నాయనీ, చివరికి చంద్రబాబుతో పాటు చిన్నపిల్లాడు దేవాన్ష్ కూడా సంపాదిస్తున్నట్లు లెక్కలు చూపిస్తున్నారని మండిపడ్డారు. తనను ఎవ్వరూ ఏమీ చేయలేరన్న ధైర్యంతోనే చంద్రబాబు ధర్మాబాద్ కోర్టు సమన్లకు గతంలో స్పందించలేదని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రికి న్యాయవ్యవస్థపై ఏమాత్రం గౌరవం లేదని విమర్శించారు.