Dublin airport: ఎయిర్ బస్సును ఎర్ర బస్సనుకున్నాడు.. విమానాన్ని ఆపాలంటూ రన్‌వేపై పరుగులు పెట్టాడు!
- విమానాశ్రయానికి ఆలస్యంగా చేరుకున్న ప్రయాణికుడు
- మూసేసిన సెక్యూరిటీ గేట్లను దాటుకుని రన్‌వే పైకి
- విమానం వెంట పరుగులు తీస్తూ ఆపాలని విజ్ఞప్తి
విమానాశ్రయానికి ఆలస్యంగా చేరుకున్న ప్రయాణికుడు కదులుతున్న విమానాన్ని చూసి కంగారు పడిపోయాడు. సూట్ కేసును పట్టుకుని రన్‌వేపై పరుగులు తీశాడు. విమానాన్ని ఆపాలంటూ గట్టిగా కేకలు వేశాడు. దీంతో ఏం జరుగుతోందో తెలియక విమాన సిబ్బంది.. అధికారులు హడలిపోయారు. ఐర్లండ్‌లోని డబ్లిన్ విమానాశ్రయంలో జరిగిందీ ఘటన.
ర్యాన్ ఎయిర్ విమానంలో ఆమ్‌స్టర్‌డ్యాం వెళ్లాల్సిన 23 ఏళ్ల పాట్రిక్ కెహోయ్‌తోపాటు మరో మహిళ చివరి నిమిషంలో ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. అయితే, అప్పటికే సెక్యూరిటీ గేటు మూసివేయడం, విమానం కదులుతుండడంతో ఏం చేయాలో తోచని పాట్రిక్ తలుపును బలంగా తోసుకుని మరీ రన్‌వేపైకి పరుగులు తీశాడు. విమానాన్ని ఆపాలంటూ గట్టిగా కేకలు వేశాడు. రన్‌వేపై ఈ అనూహ్య పరిణామానికి బిత్తరపోయిన పోలీసులు మూడు వాహనాలతో అతడిని వెంబడించి అదుపులోకి తీసుకున్నారు. మూసివేసిన సెక్యూరిటీ గేట్లను దాటుకుని మరీ రన్‌వే పైకి వచ్చినందుకు అతడిని అరెస్ట్ చేశారు.