ayodhya: దీనికి విస్తృత ధర్మాసనం అవసరం లేదు!: అయోధ్య కేసులో సుప్రీంకోర్టు తీర్పు
- విస్తృత ధర్మసనానికి బదిలీ చేయాల్సిన అవసరం లేదన్న బెంచ్
- అక్టోబర్ చివరివారంలో విచారిస్తామని వెల్లడి
- మెజారిటీ తీర్పుతో విభేదించిన జస్టిస్ నజీర్
అయోధ్యలో రామమందిరం- బాబ్రీ మసీదు వివాదంలో సుప్రీంకోర్టు ఈ రోజు కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసును ఐదుగురు జడ్జీల విస్తృత రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేయాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం 2:1 మెజారిటీతో తీర్పును ఇచ్చింది.
ఈ కేసును సుప్రీంకోర్టు అక్టోబర్ చివరివారంలో విచారిస్తుందని ధర్మాసనం స్పష్టం చేసింది. అయోధ్య కేసులో సుప్రీంకోర్టు తీసుకునే తుది నిర్ణయంపై 1994లో ఇస్మాయిల్ ఫారూఖీ కేసులో ఇచ్చిన తీర్పు ఎలాంటి ప్రభావం చూపబోదని ధర్మాసనం తేల్చిచెప్పింది. కాగా, ఈ తీర్పు విషయంలో జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ అశోక్ భూషణ్ లతో జస్టిస్ అబ్దుల్ నజీర్ విభేదిస్తూ, విస్తృత ధర్మాసనానికి నివేదించాలని అభిప్రాయపడ్డారు.