Telangana: ఎకరా స్థలంలో వాజ్‌పేయి స్మారక మందిరం, విగ్రహం!: సీఎం కేసీఆర్‌

  • హైదరాబాద్‌తో వాజ్‌పేయిది ప్రత్యేక అనుబంధం
  • వారి జ్ఞాపకాలు, చర్యలు భావితరాలకు స్ఫూర్తి కావాలి
  • ఉత్తమ విలువలున్న వ్యక్తిత్వం ఆయన సొంతం

‘హైదరాబాద్‌ మహానగరంతో దివంగత మాజీ ప్రధాని అటల్‌ బిహారి వాజ్‌పేయిది ప్రత్యేక అనుబంధం. ఆయన జ్ఞాపకాలు, చర్యలు భావితరాలకు స్ఫూర్తిగా నిలవాల్సిన అవసరం ఉంది. అందుకే ఆయన సంస్మరణార్థం ఎకరా స్థలంలో స్మారక మందిరం, విగ్రహం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది’ అని తెంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు తెలిపారు.

శాసన మండలిలో వాజ్‌పేయి సంతాప తీర్మానాన్ని సీఎం గురువారం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 'వాజ్‌పేయి పాలనలో ఉత్తమ విలువలు నెలకొల్పి ఆదర్శంగా నిలిచారు. ముక్కుసూటిగా, నిష్కర్షగా మాట్లాడే వాజ్‌పేయిది సహజంగా మృదుస్వభావం' అన్నారు. ఆయన దేశానికి ఏదో ఒకరోజు ప్రధాని అవుతారని నెహ్రూ అన్నారని, దాన్ని వాజ్ పేయి నిజం చేసుకున్నారని కేసీఆర్ చెప్పారు.

దేశ ప్రయోజనాల విషయంలో ఆయన ఎప్పుడూ రాజీపడలేదన్నారు. తన ఆదర్శవంతమైన పాలన, అణుపరీక్షల నిర్వహణ వంటి అంశాలతో వాజ్‌పేయి చరిత్రలో నిలిచిపోతారని చెప్పారు. బతికుండగానే భారతరత్న రావడం అరుదుగా జరుగుతుందని, ఆ ఘనత కూడా సాధించిన వ్యక్తి వాజ్‌పేయి అని అన్నారు. వాజ్‌పేయి ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని ముఖ్యమంత్రి తెలిపారు.

  • Loading...

More Telugu News