Sonia Gandhi: టీఆర్ఎస్‌ను ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ సరికొత్త వ్యూహం.. ‘సోనియా’ అస్త్రంతో ముందుకు!
- కాంగ్రెస్ ‘అమ్మ’ సెంటిమెంట్
- తెలంగాణ ఏర్పాటులో టీఆర్ఎస్ పాత్ర లేదని సోనియా నోటితో చెప్పించే వ్యూహం
- వెల్లడించిన కమిటీ చైర్మన్ వీహెచ్
తెలంగాణలో అతి త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్‌ను ఎదుర్కోవడానికి కాంగ్రెస్ అస్త్రశస్త్రాలు సిద్ధం చేస్తోంది. తెలంగాణ ఇచ్చిన దేవత సోనియా అంటూ సరికొత్త ప్రచారాస్త్రాన్ని సిద్ధం చేసింది. సోనియా ‘అమ్మ’ అంటూ సెంటిమెంట్‌తో కొట్టాలని భావిస్తోంది. అందులో భాగంగా ఎన్నికల షెడ్యూలు కంటే ముందే బడుగు, బలహీన వర్గాలతో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి ‘అమ్మ’ను ఆహ్వానించాలని టీపీసీసీ నిర్ణయించింది.
టీపీసీసీ వ్యూహ, ప్రణాళిక కమిటీ చైర్మన్ వి.హనుమంతరావు నేతృత్వంలో బుధవారం గాంధీభవన్‌లో నిర్వహించిన తొలి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ ఏర్పాటులో టీఆర్ఎస్ పాత్ర ఏ కోశానాలేదని స్వయంగా సోనియా నోటితో చెప్పించాలని కమిటీ నిర్ణయించింది. సమావేశం అనంతరం మీడియాతో వీహెచ్ మాట్లాడుతూ ఎన్నికల నోటిఫికేషన్, అభ్యర్థుల ప్రకటనకు ముందే సోనియాగాంధీతో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు చెప్పారు. అలాగే, ఎన్నికల మేనిఫెస్టోను ముందుగానే విడుదల చేసి దానిని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించామన్నారు. ప్రజారోగ్యం, ఓబీసీలకు ప్రస్తుతం ఉన్న క్రిమీలేయర్ విధానంపైనా దృష్టి సారించినట్టు వీహెచ్ తెలిపారు.