Araku: మావోల హిట్ లిస్టులో 200 మంది పేర్లు... జాబితాలో అయ్యన్నపాత్రుడు, బాలరాజు, ఈశ్వరి!
- బయటకు వెళ్లాలంటే వణుకుతున్న నేతలు
- అరకు ఘటన తరువాత పోలీసుల ప్రత్యేక నిఘా
- జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్న పోలీసులు
ఇంతవరకూ స్వేచ్ఛగా సంచరించిన నాయకులు, ఇప్పుడు బయటకు వెళ్లాలంటే గడగడా వణుకుతున్నారు. అరకులో జరిగిన ఘటన తరువాత, మావోయిస్టులపై ప్రత్యేక నిఘా పెట్టిన పోలీసులు, వారి వద్ద 200 మంది పేర్లతో కూడిన జాబితా ఉన్నట్టు గుర్తించారు. మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు, గతంలో మావోలుగా పనిచేసి లొంగిపోయిన యువకులు, పోలీసు ఇన్ ఫార్మర్లుగా భావిస్తున్న గిరిజనుల పేర్లు ఈ జాబితాలో ఉన్నట్టు తెలుస్తోంది.
మావోల హిట్ లిస్టులో విశాఖ జిల్లాకు చెందిన మంత్రి అయ్యన్నపాత్రుడు, మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు, ఆయన సోదరుడు వినాయక్, పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, ఆమె వ్యక్తిగత కార్యదర్శి పోలుపర్తి గోవిందరావు, బీజేపీ నేత లోకుల గాంధీ, కొయ్యూరు మండలం బూదరాళ్ల మాజీ సర్పంచ్ సూరిబాబు, ఇక్కడి టీడీపీ నేత ఎం ప్రసాద్ తదితరుల పేర్లు ఉన్నట్టు నిఘా వర్గాలు గుర్తించాయి. వీరితో పాటు పెదబయలు మండల అధ్యక్షుడు ఉమామహేశ్వరరావు, మాజీ ఎంపీపీ జర్సింగి సూర్యనారాయణ, జామిగూడ మాజీ సర్పంచ్ సుబ్బారావు, ఇంజిరి మాజీ సర్పంచులు సత్యారావు, కామేశ్వరరావుల పేర్లు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. వీరిలో చాలామందికి మావోల నుంచి ఇప్పటికే హెచ్చరికలు వెళ్లాయని పోలీసు వర్గాలు అంటున్నాయి. జాగ్రత్తగా ఉండాలని వీరందరికీ వ్యక్తిగత సమాచారం ఇస్తున్నామని తెలిపాయి.