Kidari: "రాజకీయాలు వదిలేస్తా... అన్నా, వదిలేయండి"... అని కిడారి వేడుకున్నా వినని మావోయిస్టులు!
- కాలినడకన కొంతదూరం తీసుకువెళ్లిన మావోలు
- మైనింగ్ ను వదిలేస్తానని ప్రాధేయపడ్డ కిడారి
- వెల్లడించిన ప్రత్యక్ష సాక్షులు
అరకు నియోజకవర్గంలోని డుంబ్రిగూడ మండలం లివిటిపుట్టు వద్ద ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోమ హత్యలకు సంబంధించిన మరిన్ని వివరాలు వెలుగులోకి వస్తున్నాయి. కిడారి వాహనాన్ని చుట్టుముట్టిన తరువాత, ఆయన్ను కిందకు దింపి, కాలినడకన కొంతదూరం తీసుకు వెళ్లినట్టు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. ఆపై ఆయన్ను నిలబెట్టిన మావోలు ప్రజాకోర్టును నిర్వహించారు. "మాట్లాడుకుందాం... కాల్పులు జరపవద్దు" అని కిడారి సర్వేశ్వరరావు వేడుకున్నట్టు ఈ ఘటనను చూసిన వారు అంటున్నారు.
తాను మైనింగ్ ను, రాజకీయాలను వదిలేస్తానని, తనను విడిచిపెట్టాలని కిడారి ప్రాధేయపడ్డారని ఘటనా స్థలానికి కాస్తంత దూరంలో నిలబడి, మొత్తం దృశ్యాలను చూసిన వారు అంటున్నారు. కాగా, కిడారి హత్యకు రెండు రోజుల ముందు ఓ పోలీసు అధికారి ఆయనతో సమావేశమై, మావోల నుంచి ముప్పు పొంచి వున్నట్టు నిఘా వర్గాల నుంచి సమాచారం వచ్చిందని చెప్పగా, కిడారి దాన్ని తేలికగా తీసుకున్నారు. త్వరలో ఎన్నికలు రానున్న తరుణంలో చేసిన మంచి పనులను ప్రజలకు వివరించుకోవద్దా? నేను తిరగకుంటే ఎలా? అని కిడారి ప్రశ్నించి వరుస పర్యటనలకు ప్రణాళిక వేసుకున్నారని ఆయన అనుచరులు వెల్లడించారు.