congress: దేశ భద్రత విషయంలో బీజేపీ రాజీ పడింది: కపిల్ సిబాల్
- కాంట్రాక్టు కేటాయింపుల్లో అవకతవకలు
- దేశ భద్రత కోసం 126 విమానాలూ తీసుకు రావల్సిందే
- డీల్ గురించి మోదీ, హోలాండేకు మాత్రమే తెలుసు
దేశ భద్రత విషయంలో బీజేపీ రాజీపడిందని కాంగ్రెస్ మరోసారి విమర్శించింది. రాఫెల్ విమానాల కాంట్రాక్టు కేటాయింపుల్లో అవకతవకలు జరిగాయని ఆరోపించింది. కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబాల్ మీడియాతో మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం అనుకున్న దానికంటే భారీ చెల్లింపులు జరిపిన కారణంగానే కొనుగోలు సామర్థ్యం నశించిందని.. అందుకే తక్కువ విమానాలకే పరిమితమైందని ఆరోపించారు.
దేశ భద్రత కోసం కావలసిన 126 విమానాలనూ తీసుకురావల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. రాఫెల్ డీల్ గురించి మోదీ, ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు హోలాండేకు మాత్రమే తెలుసని ఆయన తెలిపారు. మోదీ 36 రాఫెల్ విమానాల డీల్‌పై ప్రకటన చేసేశారని, ఆ ప్రకటన గురించి ఎవరికీ తెలియదని సిబాల్ అన్నారు. మోదీ ప్రకటించిన ఈ కొత్త డీల్ విషయం అరుణ్ జైట్లీకి గానీ, మనోహర్ పారికర్‌కు గానీ, నిర్మలా సీతారామన్‌కు గానీ తెలియదన్నారు. తాము కేవలం రాఫెల్ విమానాల ధరలనే అడుగుతున్నామని, టెక్నాలజీతో తమకు సంబంధం లేదని సిబాల్ అన్నారు.