Konda Surekha: హరికృష్ణ స్మారకానికి ఎవడబ్బ సొమ్మని స్థలమిచ్చారు?: కేసీఆర్ కు కొండా సురేఖ సూటి ప్రశ్న
- స్మారక స్థూపం కోసం తెలంగాణ భూమిని ఇస్తారా?
- ఆయనేమైనా ఉద్యమకారుడా? మీ చుట్టమా?
- కేసీఆర్ పై నిప్పులు చెరిగిన కొండా సురేఖ
సినీనటుడు, తెలుగుదేశం నేత నందమూరి హరికృష్ణ మరణించిన తరువాత స్మారక స్థూపం కోసం ఎవడబ్బ సొమ్మని తెలంగాణ ప్రభుత్వం స్థలాన్ని కేటాయించిందని కొండా సురేఖ ప్రశ్నించారు. టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన అనంతరం, కేసీఆర్ కు రాసిన బహిరంగ లేఖలో పలు విమర్శలు గుప్పించారు. హరికృష్ణ స్మారకానికి ఏ ప్రాతిపదికన స్థలం కేటాయించారో చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. ఆయనేమీ తెలంగాణ కోసం ఉద్యమం చేయలేదని, కేసీఆర్ కు చుట్టమేమీ కాదని, అమరవీరుల కుటుంబ సభ్యుడు అంతకన్నా కాదని, స్థలాన్ని ఎందుకు కేటాయించారని ప్రశ్నించారు.
హరికృష్ణ మరణించిన నిమిషాల వ్యవధిలోనే, కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆర్, అక్కడికి వెళ్లారని, అంత్యక్రియలు పూర్తయ్యే దాకా కేటీఆర్ అక్కడే ఉన్నారని గుర్తు చేసిన ఆమె, తెలంగాణ భూమిని ధారాదత్తం చేశారని మండిపడ్డారు. కొండా లక్ష్మణ్ బాపూజీ, మాజీ సీఎం టీ అంజయ్య భార్య మణెమ్మ చనిపోతే పరామర్శించేందుకు కేసీఆర్ కు తీరిక లేకపోయిందని నిప్పులు చెరిగారు. కొండగట్టు బస్సు ప్రమాదంలో 60 మందికి పైగా చనిపోతే వారిని కూడా ఓదార్చేందుకు కేసీఆర్ రాలేదని కొండా సురేఖ దుయ్యబట్టారు.