KCR: నా మెడ పట్టుకుని బయటకు గెంటినట్టు అయింది... ఆత్మాభిమానం చంపుకోలేను: కొండా సురేఖ
- టీఆర్ఎస్ లో ఎన్నో అవమానాలు ఎదురయ్యాయి
- కేసీఆర్ పై గౌరవంతో ఎన్నడూ బయటపడలేదు
- పుట్టిన రోజున ఆశీర్వాదం తీసుకుందామన్నా కలవనీయలేదు
- హైదరాబాద్ లో మీడియాతో కొండా సురేఖ
టీఆర్ఎస్ పార్టీలో ఏ పదవినీ ఆశించకుండా పనిచేస్తున్న తనను ఇప్పుడు మెడ పట్టుకుని బయటకు గెంటినట్టుగా కేసీఆర్ చేశారని వరంగల్ జిల్లా మహిళా నేత కొండా సురేఖ వాపోయారు. హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన ఆమె, ఆత్మాభిమానాన్ని చంపుకోలేకనే టీఆర్ఎస్ పార్టీని వీడుతున్నానని చెప్పారు. పార్టీలో ఎన్నో అవమానాలు తనకు ఎదురైనా, కేసీఆర్ మీద గౌరవంతో ఎన్నడూ బయటపడలేదని చెప్పిన ఆమె, తనకు అసెంబ్లీ సీటును నిరాకరించడం వెనకున్న కారణాన్ని కూడా చెప్పలేదని విమర్శించారు.
కేసీఆర్ ను నమ్మినందుకు తనకు నమ్మక ద్రోహం చేశారని ఆరోపించిన కొండా సురేఖ, ఓ మహిళగా, నాలుగుసార్లు గెలిచిన ఎమ్మెల్యేగా ఉన్న తనను మంత్రివర్గంలోకి తీసుకోకున్నా సర్దుకు పోయానని చెప్పారు. ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకుండా తన గౌరవాన్ని దెబ్బతీశారని, ఇది తనకెంతో బాధను కలిగించిందని అన్నారు. తన పుట్టిన రోజున కేసీఆర్ ఆశీస్సులు తీసుకునేందుకు ప్రయత్నించి కూడా తాను విఫలమయ్యానని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం కోసం తిండీ తిప్పలు మాని, తమ చదువులను పక్కనబెట్టి, కెరీర్ ను వదులుకుని ఉద్యమించిన యువతకు కేసీఆర్ ఏం న్యాయం చేశారని సురేఖ ప్రశ్నించారు.
షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరిగితే, ప్రజా వ్యతిరేకత పెరిగి ఓడిపోతానన్న భయాందోళనలతోనే కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వచ్చారని ఆరోపించారు. ఐదేళ్లు అధికారంలో ఉండి, పరిపాలించాలని ప్రజలు ఓటేసి గెలిపిస్తే, ఇలా ముందే ఎన్నికలకు వెళ్లడం ద్వారా ఎలాంటి సంకేతాలు ఇస్తున్నారో కేసీఆర్ స్వయంగా తెలియజేయాలని కొండా సురేఖ డిమాండ్ చేశారు.