Andhra Pradesh: ప్రజాసంకల్ప యాత్ర సందర్భంగా జగన్ ఆహారం, అలవాట్లు ఇవే!
- 269వ రోజుకు చేరుకున్న ప్రజాసంకల్ప యాత్ర
- అలుపెరగకుండా దూసుకెళుతున్న జగన్
- ఆహార అలవాట్లను వెల్లడించిన పార్టీ శ్రేణులు
ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా వైసీపీ అధినేత జగన్ ఈ రోజు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించారు. 269 రోజులుగా ప్రజాసంకల్ప యాత్రలో ఉన్నప్పటికీ ఏమాత్రం అలసటగా లేకుండా ముందుకు దూసుకుపోతున్నారు. ఇంతలా ప్రజల్లో మమేకం అవుతున్నా జగన్ ప్రతిరోజూ అంతేస్థాయిలో ఉత్సాహంగా ఉండటానికి కారణం ఏంటి? తాజాగా ఈ విషయాన్ని వైసీపీ శ్రేణులు బయటపెట్టాయి.
ఉదయం 4.30 గంటలకే మెలకువ..
ప్రజా సంకల్పయాత్రలో భాగంగా వైఎస్ జగన్ రోజూ ఉదయం 4.30 గంటలకే నిద్రలేస్తారు. అనంతరం గంటపాటు వ్యాయామం చేస్తారు. కాలకృత్యాల అనంతరం ఉదయం 7 గంటల వరకూ న్యూస్ పేపర్లు చదువుతారు. అనంతరం పార్టీ ముఖ్య నేతలతో పలు అంశాలపై చర్చిస్తారు. ఆ తర్వాత ప్రజాసంకల్ప యాత్ర రూట్ మ్యాప్ ను అడిగి తెలుసుకుంటారు. కచ్చితంగా షెడ్యూల్ ప్రకారమే యాత్ర కొనసాగేలా చూస్తారు.
ఓ గ్లాస్ జ్యూస్ తోనే యాత్ర ప్రారంభం..
ప్రజాసంకల్ప యాత్ర సందర్భంగా జగన్ ఎలాంటి అల్పాహారం తీసుకోరు. కేవలం ఉదయం పూట ఓ గ్లాస్ జ్యూస్ తాగి యాత్రను ప్రారంభిస్తారు. మధ్యాహ్నం కప్పు పెరుగుతో పాటు కొన్ని పండ్లు ఆహారంగా తీసుకుంటారు. ఇక రాత్రిపూట రెండు పుల్కాలు, పప్పు, మరో కూరను ఆహారంగా తీసుకుంటారు. నిద్రపోయేముందు కప్పు పాలు తాగుతారు.
గత 269 రోజులుగా వైఎస్ జగన్ దినచర్య ఇలానే కొనసాగుతోంది. రాత్రి నిద్రపోవడం ఎంత ఆలస్యమైనా ఉదయాన్నే కరెక్టుగా 4.30 గంటలకు జగన్ నిద్రలేస్తారు. రోజూ తెల్లటి చొక్కా, క్రీమ్ కలర్ ఫ్యాంట్, కాళ్లకు బూట్లు ధరించాక జగన్ యాత్ర ప్రారంభమవుతుంది. ఈ రోజు విజయనగరం జిల్లాలో జగన్ ప్రజా సంకల్పయాత్ర 3,000 కిలోమీటర్లకు చేరుకోనున్న సంగతి తెలిసిందే.