araku: అరకు ఘటనపై స్పందించిన విశాఖ రేంజ్ డీఐజీ శ్రీకాంత్
- మధ్యాహ్నం సమయంలో ఈ ఘటన జరిగింది
- పీఎస్ఓల ఆయుధాలను మావోయిస్టులు లాక్కున్నారు
- ఈ ఘటనకు గల కారణాలను విచారిస్తున్నాం
అరకు టీడీపీ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోమలను మావోయిస్టులు అడ్డగించి కాల్చి చంపిన ఘటనపై విశాఖ రేంజ్ డీఐజీ శ్రీకాంత్ స్పందించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలు గ్రామదర్శిని కార్యక్రమానికి వెళ్తుండగా వారి వాహనాలను ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో మావోయిస్టులు అడ్డగించారని చెప్పారు. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల వ్యక్తిగత భద్రతా సిబ్బంది (పీఎస్ఓ) ఆయుధాలను మావోయిస్టులు లాక్కున్నారని అన్నారు. ఒడిశా సరిహద్దుకు పదిహేను కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన జరిగిందని, ఈ ఘటనకు గల కారణాలను పూర్తి స్థాయిలో విచారిస్తున్నామని చెప్పారు. సర్వేశ్వరరావు, సోమ భౌతికకాయాలను విశాఖపట్టణంలోని కేజీహెచ్ కు తరలిస్తున్నట్టు చెప్పారు.