Karnataka: పట్టపగలే మహిళ కిడ్నాప్.. ఇంట్లోంచి లాక్కొచ్చి కారులో పడేసిన దుండగులు!

  • రూ.30 వేలు అప్పు తీసుకున్నందుకు కిరాతకం
  • తన వద్ద వెట్టి చాకిరీ చేయాలని బలవంతం
  • ఇంటి కొచ్చి మహిళను కిడ్నాప్ చేసిన వైనం

ఓ మహిళను పట్టపగలే ఇంట్లోంచి ఈడ్చుకొచ్చి బలవంతంగా కారులో ఎక్కించి దుండగులు కిడ్నాప్ చేశారు. తనను విడిచిపెట్టాలని బాధిత మహిళ మొత్తుకుంటున్నా వినిపించుకోలేదు. కర్ణాటకలోని మాండ్యా జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అయింది. స్థానికులు అప్రమత్తమై పోలీసులకు సమాచారం అందించడంతో కొన్ని గంటల్లోనే కిడ్నాపర్ల చెర నుంచి బాధిత మహిళ బయటపడగలిగింది.

తమిళనాడుకు చెందిన జానకమ్మ (28), ఆయన భర్త చిన్నతంబి 12 ఏళ్ల క్రితం కర్ణాటకకు వలస వచ్చారు. నగేశ్ అనే వ్యక్తి వద్ద వ్యవసాయ కూలీలుగా చేరారు. ఈ క్రమంలో ఓసారి చిన్నతంబి అనారోగ్యం పాలయ్యాడు. అతడి వైద్య చికిత్స కోసం నగేశ్ నుంచి కొంత అప్పు తీసుకున్నారు. డబ్బులు చెల్లించలేని వారి బలహీనతను ఆసరాగా చేసుకున్న నగేశ్ అప్పటి నుంచి చిన్నతంబి, జానకమ్మను తన వద్ద వెట్టి చాకిరీ చేయాలని బలవంతం చేస్తున్నాడు.

మూడేళ్ల క్రితం తన భర్త అనారోగ్యం పాలైతే నగేశ్ నుంచి రూ.30 వేలు అప్పు తీసుకున్నామని, పనిచేసి తీర్చేస్తామని చెప్పామని బాధితురాలు తెలిపింది. అయితే, అప్పు ఇచ్చిన కొన్ని నెలల నుంచే తమను వెట్టిచాకిరీకి ఉండమని బలవంతం చేస్తున్నాడని జానకమ్మ ఆరోపించింది. తమతో ఇటుకలు చేయిస్తున్నాడని, పొలం పనులు, తోటపని చేయించుకోవడంతోపాటు తమను పశువుల్లా వాడుకుంటున్నాడని  ఆవేదన వ్యక్తం చేసింది. తన ఆరోగ్యం బాగాలేదన్నా వదలడం లేదని, ఆసుపత్రికి వెళ్లి చూపించుకుని వస్తానన్నా పంపలేదని ఆరోపించింది. చివరికి ధైర్యం తెచ్చుకుని నగేశ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నట్టు చెప్పింది.

విషయం తెలిసిన నగేశ్ ఇంటికి వచ్చి బలవంతంగా లాక్కెళ్లి కిడ్నాప్ చేశాడని పేర్కొంది. ఎవరో ఈ మొత్తం తతంగాన్ని వీడియో తీసి జీతా విముక్త అనే స్వచ్ఛంద సంస్థకు పంపడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారని  జానకమ్మ తెలిపింది. స్వచ్ఛంద సంస్థ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు జానకమ్మను కిడ్నాపర్ల చెర నుంచి విడిపించారు. నగేశ్‌ను అరెస్ట్ చేశారు. ఆయన అనుచరులు పరారయ్యారు.

Karnataka
Mandya
abduct
Police
bonded labour
  • Loading...

More Telugu News