Abhilash tomy: హిందూ మహాసముద్రంలో చిక్కుకుపోయిన భారత నేవీ కమాండర్
- గోల్డెన్ గ్లోబ్ రేస్‌లో పాల్గొనేందుకు వెళ్లిన టామీ
- రంగంలోకి దిగిన భారత నావికా దళ సిబ్బంది
- కాపాడేందుకు రెస్క్యూ కో-ఆర్డినేషన్ అధికారుల యత్నం
ఫ్రాన్స్‌లో జరిగే గోల్డెన్ గ్లోబ్ రేస్(2018)లో పాల్గొనేందుకు భారత్ నుంచి వెళ్లిన నేవీ కమాండర్ అభిలాష్ టామీ నడి సంద్రంలో చిక్కుకుపోయారు. ఆయనను కాపాడేందుకు అధికారులు చర్యలు ముమ్మరం చేశారు. ఆస్ట్రేలియాలోని పెర్త్‌కు 1900 నాటికల్ మైళ్ల దూరంలో టామీ చిక్కుకుపోయినట్టు తెలుస్తోంది. ఆయనకు తీవ్ర వెన్నునొప్పి రావడంతో పాటు వాతావరణం కూడా అనుకూలించకపోవడంతో టామీ ప్రయాణిస్తున్న సెయిలింగ్ బోట్ ‘థురియా’ హిందూ మహాసముద్రంలో చిక్కుకుపోయింది.
ఆయన కోసం భారత నావికా దళ సిబ్బంది రంగంలోకి దిగింది. ఐఎన్ఎస్ సత్పూరను పంపించినట్టు భారత రక్షణ శాఖ ప్రతినిధి ఒకరు మీడియాకు వెల్లడించారు. ఇప్పటికే టామీని కాపాడేందుకు ఆస్ట్రేలియా రెస్క్యూ కో-ఆర్డినేషన్ అధికారులు ప్రయత్నిస్తున్నారు. గోల్డెన్ గ్లోబ్ రేస్‌లో భారత్ నుంచి పాల్గొనే ఏకైక వ్యక్తి టామీనే కావడం విశేషం.