jaipal reddy: రూ.41వేల కోట్లు నష్టం వచ్చేలా ప్రభుత్వం వ్యవహరించింది: జైపాల్ రెడ్డి
- దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభకోణం
- రక్షణ శాఖ ఎలాంటి నిబంధనలూ పాటించలేదు
- నిర్మలా సీతారామన్, అరుణ్ జైట్లీ రాజీనామా చేయాలి
రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు వ్యవహారంలో రూ.41వేల కోట్లు నష్టం వచ్చేలా మోదీ ప్రభుత్వం వ్యవహరించిందని కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గాంధీ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అంత పెద్ద ఒప్పందం కుదుర్చుకున్న సమయంలో సంబంధిత మంత్రి మోదీ వెంట లేకపోవడం గమనార్హమన్నారు. ఈ సమయంలో మోదీ వెంట అనిల్ అంబానీ ఉన్నారని పేర్కొన్నారు. దీనిని దేశ చరిత్రలోనే అతి పెద్ద కుంభకోణంగా జైపాల్ అభివర్ణించారు. ఆయుధాల కొనుగోలు విషయంలో రక్షణ శాఖ ఎలాంటి నిబంధనలూ పాటించలేదని ఆయన ఆరోపించారు. దేశ ప్రజలకు అబద్ధాలు చెప్పినందుకు కేంద్రమంత్రులు నిర్మలా సీతారామన్, అరుణ్ జైట్లీ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.