rajiv khel ratna: భజరంగ్ ను కాదని కోహ్లీకి ‘ఖేల్ రత్న’ ఎలా ఇస్తారు?: మండిపడుతున్న నెటిజన్లు!
- 80 పాయింట్లు సాధించిన పూనియా
- ఒక్క పాయింట్ దక్కించుకోని విరాట్
- కోర్టుకు వెళ్లాలని భావిస్తున్న రెజ్లర్
క్రీడాకారులను అవార్డులకు ఎంపిక చేయడం కోసం కేంద్రం ప్రవేశపెట్టిన పాయింట్ల వివాదం గొడవను రాజేస్తోంది. అధిక పాయింట్లను సాధించిన వారిని కాదని ఇష్టానుసారంగా రాజీవ్ ఖేల్ రత్న అవార్డులను అందించడంపై ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం విజేత భజ్ రంగ్ పూనియాతో పాటు ప్రజలు మండిపడుతున్నారు.
క్రీడా పురస్కారాల ఎంపిక కోసం కేంద్రం గతేడాది పాయింట్ల విధానాన్ని ప్రవేశపెట్టింది. తమ విభాగాల్లో అత్యుత్తమ ప్రదర్శన ఆధారంగా ఈ పాయింట్లను కేటాయిస్తారు. ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం సాధించిన పూనియా ఈ ఏడాది 80 పాయింట్లతో టాప్ గా నిలిచాడు. మరో రెజ్లర్ వినేశ్ ఫోగట్ సైతం 80 పాయింట్లు సాధించింది. పారా అథ్లెట్ దీపా మాలిక్ (78.4), మనిక బత్రా (65), అభిషేక్ (55.63), వికాస్ (52) వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను(44) ఆ తర్వాతి స్థానాల్లో నిలిచారు. క్రికెట్ ఒలింపిక్స్ లో భాగం కాకపోవడంతో భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీకి ర్యాంకింగ్ వర్తింపజేయలేదు. దీంతో కోహ్లీ ఖాతాలో పాయింట్లు ఏమీ లేవు.
ఈ నేపథ్యంలో టాప్ లో నిలిచిన పూనియాను కాదని కోహ్లీతో పాటు మీరాబాయి చానూను ప్రభుత్వం రాజీవ్ ఖేల్ రత్న అవార్డుకు ఎంపిక చేయడంతో వివాదం రాజుకుంది. దీంతో ఈ అవార్డులను ప్రకటించడంపై కోర్టుకు వెళ్లాలని భజరంగ్ పూనియా అనుకున్నాడు. అయితే దీని కారణంగా రాబోయే ప్రపంచ ఛాంపియన్ షిప్ సన్నాహకాలు దెబ్బ తింటాయని మరో సహచరుడు యోగేశ్వర్ దత్ వారించడంతో పూనియా వెనక్కు తగ్గాడు.