pardha chaterjee: సైనికుల ప్రాణ త్యాగాలను రాజకీయం చేయబోము: పశ్చిమ బెంగాల్ మంత్రి పార్థ చటర్జీ
- మెరుపుదాడుల దినోత్సవాన్ని జరపాలని ఆదేశం
- రాజకీయ లాభం కోసం బీజేపీ చేయిస్తోందన్న చటర్జీ
- మద్దతు తెలిపేదే లేదని స్పష్టం
దేశంలోని అన్ని ఉన్నత విద్యా సంస్థల్లో సెప్టెంబరు 29న మెరుపుదాడుల దినోత్సవంగా జరపాలని యూజీసీ గురువారం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఇదంతా బీజేపీ చేయిస్తోందని, దీనికి తాము మద్దతు తెలిపేది లేదని పశ్చిమ బెంగాల్ విద్యాశాఖ మంత్రి పార్థ ఛటర్జీ శుక్రవారం తెలిపారు. సైనికుల ప్రాణత్యాగాలను రాజకీయం చేసేది లేదని ఆయన స్పష్టం చేశారు. తమ రాష్ట్రంలోని ఏ విద్యాసంస్థలోనూ మెరుపు దాడుల దినోత్సవాన్ని నిర్వహించబోమని ఆయన స్పష్టం చేశారు.
ఈ విషయమై ఆయన మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా యూజీసీని అడ్డు పెట్టుకొని ఇదంతా బీజేపీ చేస్తోందని ఆరోపించారు. అమరవీరుల త్యాగాలను కొనియాడాలని యూజీసీ చెప్పడాన్ని అర్థం చేసుకుంటామన్నారు. దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన మన సైనికులను ఎప్పుడూ గౌరవిస్తామని చటర్జీ తెలిపారు. భారత్ ఆర్మీ రాజకీయాలకు, వివాదాలకు ఎప్పుడూ దూరంగానే ఉంటుందని... కానీ, బీజేపీ తన రాజకీయ లబ్ధికోసం ఇప్పుడు ఆర్మీని ఉపయోగించుకోవడం సరికాదన్నారు. దీనిని తామెప్పుడూ సమర్థించేదే లేదని చటర్జీ స్పష్టం చేశారు.