jet airways: జెట్ ఎయిర్ వేస్ లో ప్రయాణికుల ముక్కు, చెవుల్లోంచి రక్తం.. కొన్నాళ్లు ఆ అవయవాలు పని చేయవన్న డాక్టర్లు!
- ముంబై నుంచి జైపూర్ వెళ్తున్న విమానంలో ఘటన
- ఒత్తిడిని తగ్గించే స్విచ్ ను ఆన్ చేయడాన్ని మర్చిపోయిన సిబ్బంది
- ఒత్తిడికి ప్రయాణికుల ముక్కు, చెవుల్లోంచి రక్తం
జెట్ ఎయిర్ వేస్ సిబ్బంది నిర్లక్ష్యం 30 మంది ప్రయాణికులకు శాపంలా మారింది. వివరాల్లోకి వెళ్తే, ముంబై నుంచి జైపూర్ వెళ్తున్న విమానంలో... క్యాబిన్ లోని గాలి ఒత్తిడిని కంట్రోల్ చేసే స్విచ్ ను ఆన్ చేయడాన్ని విమాన సిబ్బంది మర్చిపోయారు. దీంతో, విమానంలో ఒత్తిడి ఏర్పడి... ప్రయాణికులు నరకాన్ని చవి చూశారు. వారి ముక్కు, చెవుల నుంచి రక్తం కారింది. మరికొందరు భరించలేని తలనొప్పితో బాధపడ్డారు. దీంతో విమానాన్ని మళ్లీ ముంబైకి మళ్లించారు. అస్వస్థతకు గురైన ప్రయాణికులను ముంబైలోని నానావతి ఆసుపత్రికి తరలించారు.
ముక్కు, చెవుల్లోంచి రక్తం కారిన ప్రయాణికులకు చికిత్స అందించిన వైద్యులు మాట్లాడుతూ, ఆ రెండు అవయవాలు వారికి కొంత కాలం పాటు పని చేయవని చెప్పారు. వారంతా కొంత కాలం పాటు విమానం ఎక్కకపోవడమే మంచిదని సూచించారు. ఈ ఘటన జరిగిన సమయంలో విమానంలో మొత్తం 166 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ఘటనపై డీజీసీఏ సీరియస్ అయింది. విమానంలో ఉన్న సిబ్బందిని తొలగించడమే కాకుండా, విచారణకు ఆదేశించింది.