Uttarakhand: 'జాతీయ మాత'గా ఆవును చేద్దాం.. ఉత్తరాఖండ్ అసెంబ్లీ తీర్మానం!
- సభలో ప్రవేశపెట్టిన మంత్రి ఆర్య
- ఏకగ్రీవంగా ఆమోదించిన సభ్యులు
- ఆవు ప్రయోజనాలను ఏకరవు పెట్టిన మంత్రి
ఆవులకు హిందూ సంప్రదాయంలో చాలా పవిత్రమైన స్థానం ఉంది. గోమాతగా పూజిస్తారు. తాజాగా ఆవును 'జాతీయ మాత'గా గుర్తించాలంటూ ఉత్తరాఖండ్ అసెంబ్లీ తీర్మానించింది. జాతిపితగా మహాత్మా గాంధీ ఉన్నట్లే జాతీయ మాతగా ఆవును ప్రకటించాలని సభలో ప్రవేశపెట్టిన బిల్లుకు శాసన సభ్యులందరూ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు.
ఈ విషయమై సభలో బిల్లును ప్రవేశపెట్టిన ఉత్తరాఖండ్ పశుసంవర్ధకశాఖ మంత్రి రేఖా ఆర్య మాట్లాడుతూ.. ‘చెట్లు కార్బన్ డయాక్సైడ్‌ని పీల్చుకుని, ఆక్సిజన్‌ని విడుదల చేస్తాయి. కానీ మనలో చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఆవులు ఆక్సిజన్‌ను శ్వాసించడమే కాకుండా.. ఆక్సిజన్‌ను విడుదల చేస్తాయి. అంతేకాకుండా గో మూత్రం చాలా శ్రేష్ఠమైనది. అప్పుడే పుట్టిన పిల్లలకు తల్లి పాల తర్వాత ఆవు పాలు ఎంతో మంచివి’ అన్నారు.
ఇన్ని గొప్ప ప్రయోజనాలు ఉన్న ఆవును జాతి మాత(మదర్ ఆఫ్ ద నేషన్)గా గుర్తించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. ఈ తీర్మానానికి ప్రతిపక్షం పూర్తి కూడా మద్దతు ఇచ్చిందని తెలిపారు.