Pkistan: సార్క్ సదస్సు నిర్వహణకు మద్దతివ్వండి : భారత ప్రధానిని కోరిన పాక్ ప్రధాని ఇమ్రాన్
- ప్రత్యుత్తరంలో పలు కీలకాంశాలు ప్రస్తావన
- ఇరుదేశాల విదేశాంగ మంత్రుల భేటీకి తేదీలు ఖరారు చేయండి
- సమస్యలను శాంతియుతంగా, చర్చల ద్వారా పరిష్కరించుకుందామని సూచన
పాకిస్థాన్‌లో సార్క్ దేశాల సదస్సు నిర్వహణకు భారత్ పూర్తి మద్దతు ఇవ్వాలని ఆ దేశ నూతన ప్రధాని ఇమ్రాన్‌ఖాన్, భారత్ ప్రధాని నరేంద్రమోదీని కోరారు. ప్రధానిగా తాను పదవీ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ మోదీ రాసిన లేఖకు ఇమ్రాన్ ప్రత్యుత్తరం ఇచ్చారు. ఇందులో ఇరుదేశాలకు సంబంధించిన పలు కీలక అంశాలను ప్రస్తావించారు. 2016లో పాకిస్థాన్‌లో జరగాల్సిన సార్క్ సదస్సు జమ్ము-కశ్మీర్ యూరీ సెక్టార్‌లోని ఆర్మీ స్థావరంపై ఉగ్రవాదుల దాడితో రద్దయింది.
ఈ నేపథ్యంలో తమ దేశంలో తదుపరి సదస్సు జరిగేందుకు భారత్ సహకరించాలని ఇమ్రాన్ లేఖలో కోరారు. సమస్యలు శాంతియుతంగా, చర్చల ద్వారా పరిష్కరించుకుందామని, ఇరుదేశాల విదేశాంగ మంత్రుల భేటీకి తేదీ ఖరారు చేయాలని లేఖలో సూచించారు. ప్రస్తుతం భారత విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనేందుకు న్యూయార్క్‌లో ఉన్నారు. ఈ సందర్భంగా సుష్మ సార్క్ దేశాల విదేశాంగ మంత్రులతో అనధికార సమావేశం నిర్వహించే అవకాశం ఉంది. ఈ సమావేశానికి పాకిస్థాన్ మంత్రి కూడా హాజరవుతారు. ఈ సందర్భంగా తేదీపై ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందనుకుంటున్నారు.