JEE MAINS Advance: ‘స్వయం ప్రభ’ యాప్‌తో అరచేతిలో తరగతి గది!
- అందుబాటులోకి తీసుకువచ్చిన కేంద్ర మానవ వనరుల శాఖ
- జేఈఈ, నీట్ పరీక్షలకు ఫోన్ చూసి ప్రిపేరయ్యే అవకాశం
- ఢిల్లీ ఐఐటీ నేతృత్వంలో ఆరు వందల పాఠాలు
దేశంలో నిర్వహించే ప్రతిష్ఠాత్మక జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్, నీట్ ప్రవేశ పరీక్షలకు ప్రిపేరవుతున్నారా? కోచింగ్ తీసుకునేందుకు అవకాశం లేదు, ప్రిపరేషన్ ఎలా? అని ఆదుర్దా చెందుతున్నారా? ఆ చింతేం ఇక అక్కర్లేదు. స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే అర చేతిలో తరగతి గది అందుబాటులోకి వస్తుంది. అదెలా అంటే? విద్యార్థుల సౌలభ్యం కోసం కేంద్రమానవ వనరుల శాఖ అందుబాటులోకి తీసుకువచ్చిన ‘స్వయం ప్రభ’ యాప్ తో ఇది సాధ్యమవుతుంది.
ఆర్థికంగా వెనుకబడిన వారు శిక్షణ కేంద్రాలపై ఆధారపడకుండా వారికి నాణ్యమైన బోధన అందించాలన్న ఉద్దేశంతో ఢిల్లీ ఐఐటీ నేతృత్వంలో 600 పాఠాలతో ఈ యాప్‌ను రూపొందించారు. గణితం, భౌతిక, జీవ, రసాయన శాస్త్రాలను ఈ యాప్ ద్వారా అధ్యయనం చేయొచ్చు. ‘స్వయం ప్రభ’ పేరుతో మొత్తం 32 డైరెక్ట్ టు హోం (డీటీహెచ్) చానెళ్లను కేంద్రం అందుబాటులోకి తెచ్చింది.
వీటిలో 19, 20, 21వ నంబర్ చానెళ్లను జేఈఈ, నీట్ పరీక్షలకు ప్రిపేరయ్యే వారి కోసం కేటాయించారు. ఒక్కో చానెల్‌లో ఒక్కో సబ్జెక్టు పాఠాలు ప్రసారమవుతాయి. నెట్ లేదా సెటప్ బాక్స్ సౌకర్యం ఉన్న వారే ఈ పాఠాలను ఉపయోగించుకోగలరు. గూగుల్ ప్లేస్టోర్ నుంచి యాప్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఎన్‌టీఏ వెబ్‌సైట్ (www.nta.ac.in)లోనూ ఈ పాఠ్యాంశాను పొందుపరిచారు.