Krishna District: ఆటోలో పుట్టిన మైనర్ ప్రేమ... కూడదన్న పెద్దలు... ఇద్దరి ఆత్మహత్య!

  • పెళ్లయి బిడ్డ ఉన్న వ్యక్తిని ప్రేమించిన మైనర్ బాలిక
  • బాలికనూ అంతే ప్రేమించిన యువకుడు
  • పెద్దలు కాదంటున్నారని పెళ్లి చేసుకుని ఆత్మహత్య
  • కృష్ణా జిల్లా తిరువూరు సమీపంలో కలకలం

అతను ఆటో నడుపుకునే యువకుడు. పెళ్లయి, నాలుగేళ్ల బిడ్డ కూడా ఉన్నాడు. అతని ఆటోలో వెళ్లే ఓ ఇంటర్ విద్యార్థిని, ఎదిగీ ఎదగని వయసులో అతనితో ప్రేమలో పడింది. ఆటో డ్రైవర్ కూడా ఆమె కావాలని అనుకున్నాడు. ఈ విషయం రెండు కుటుంబాల్లో కలతలు రేపింది. ఇద్దరూ ఆత్మహత్యాయత్నాలు చేశారు. కేసులు పెట్టినా ఆటో డ్రైవర్ ఆమెను వదిలి ఉండలేకపోయాడు. భార్యాబిడ్డలను మరచి ఆ మైనర్ బాలికను రహస్యంగా వివాహం చేసుకున్నాడు. వారి పెళ్లిని లోకం అంగీకరించకపోవడంతో, ఇక బతకలేమంటూ ఇద్దరూ ఆత్మహత్య చేసుకుని తనువు చాలించారు.

ఈ ఘటన ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలో తీవ్ర కలకలాన్ని రేపింది. పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, కృష్ణాజిల్లా, కోకిలంపాడుకు చెందిన జొన్నలగడ్డ తిరుపతిరావు (23)కు 2013లో వివాహం కాగా, ప్రస్తుతం నాలుగేళ్ల కొడుకు ఉన్నాడు. ఆ గ్రామానికే చెందిన కొంగల శ్రీలక్ష్మి తిరువూరులో ఇంటర్‌ చదువుతూ, నిత్యమూ తిరుపతిరావు ఆటోలోనే కాలేజీకి వెళ్లివస్తుండేది.

ఆ క్రమంలో వారి పరిచయం, ప్రేమగా మారగా, ఏడాదిగా రెండు కుటుంబాల మధ్య గొడవలు జరుగుతున్నాయి. పోలీసు స్టేషన్లలో కేసులు, పెద్దల వద్ద పంచాయతీలూ జరిగాయి. అయినా అతడిని శ్రీలక్ష్మి, తిరుపతిరావు ఆమెను మరచిపోలేదు. నాలుగు రోజుల క్రితం శ్రీలక్ష్మిని ఆమె తల్లిదండ్రులు ఇంట్లోంచి గెంటేయడంతో, ఆమె తిరుపతిరావును కలిసింది. ఆమెకు ఓ ఇంట్లో తాళికట్టిన తిరుపతిరావు, తన బంధువైన గొల్లమందల శివను దగ్గరలోని ఓ గుడికి రమ్మని పిలిచాడు.

అప్పటికే పురుగులమందు కలుపుకొని తెచ్చుకున్న శీతలపానీయాన్ని తాగిన వారిరువురూ కాసేపటి తరువాత, శివకు విషయం చెప్పారు. దీంతో కంగారుపడిన శివ, వారిని ఆసుపత్రికి తరలిస్తుండగానే, ఇద్దరూ అపస్మారకస్థితిలో పడిపోయారు. స్థానికుల సాయంతో పెనుబల్లి వైద్యశాలకు వారిని తరలించినా, ప్రాణాలు మిగల్లేదు. ఏడు నెలలు క్రితం కూడా వారు ఆత్మహత్యాయత్నం చేయగా, సకాలంలో వైద్యశాలకు తీసుకెళ్లడంతో బతికారని కుటుంబీకులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నట్టు పోలీసులు చెప్పారు. 

Krishna District
Tiruvuru
Sucide
Auto
Minor
Love
  • Loading...

More Telugu News