paritala sunitha: అసెంబ్లీలో సమాధానం చెప్పలేక తడబడిన పరిటాల సునీత!
- చంద్రన్న పెళ్లికానుక వివాహ రిజిస్ట్రేషన్లపై వాడివేడి చర్చ
- పంచాయతీ కార్యదర్శులు ఎలా రిజిస్ట్రేషన్ చేస్తారన్న కూన రవి
- సవరణలను పొందుపరచకుండా.. బిల్లును ఎలా ఆమోదిస్తారన్న మోదుగుల
అమరావతిలోని ఏపీ అసెంబ్లీలో ఈరోజు చంద్రన్న పెళ్లి కానుక వివాహ రిజిస్ట్రేషన్ పై వాడివేడి చర్చ జరిగింది. ఈ వివాహాలను పంచాయతీ కార్యదర్శులు ఎలా రిజిస్ట్రేషన్ చేస్తారని టీడీపీ ఎమ్మెల్యే కూన రవి ప్రశ్నించారు. ఈ సందర్భంగా సమాధానం చెప్పలేక మంత్రి పరిటాల సునీత కాస్త ఇబ్బంది పడ్డారు.
బిల్లులో కొన్ని సవరణలు చేయాల్సి ఉందంటూ... కొన్ని సవరణలను కూన రవి, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, మాణిక్యాలరావులు సూచించారు. సవరణలు అవసరం లేకుండానే బిల్లును ఆమోదించాలని సునీత కోరారు. ఈ సందర్భంగా మంత్రి సునీత తీరుపై టీడీపీ ఎమ్మెల్యే మోదుగుల అభ్యంతరం వ్యక్తం చేశారు. బిల్లుపై పూర్తి చర్చ లేకుండా, సవరణలను పొందుపరచకుండా, ఎలా ఆమోదిస్తారని ఆయన ప్రశ్నించారు.
అసెంబ్లీలో సమావేశాలకు ప్రధాన ప్రతిపక్షం వైసీపీ దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, టీడీపీ ప్రజాప్రతినిధులే సమస్యలను సభలో లేవనెత్తాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు.