Laluprasda yadav: లాలూ కుటుంబాన్ని వదలని కేసుల బెడద.. మరో కేసులో కోర్టు నోటీసులు!
- ఐఆర్‌సీటీసీ హోటళ్ల లీజులో నగదు అక్రమ చలామణి జరిగిందన్న ఆరోపణలు
- లాలూతోపాటు, భార్య, కుమారుడికి సమన్లు
- రాంచీ జైలు నుంచి తెచ్చేందుకు ప్రొడక్షన్ వారెంట్ జారీ
బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్‌యాదవ్ కుటుంబాన్ని కేసుల బెడద వదలడం లేదు. ఒకదాని తర్వాత మరొకటి వెంటాడుతూనే ఉన్నాయి. పలు కేసుల్లో శిక్షపడి ప్రస్తుతం రాంచీ జైలులో ఉన్న లాలుకు ఢిల్లీ అదనపు సెషన్స్ కోర్టు సోమవారం సమన్లు జారీచేసింది. లాలూతోపాటు ఆయన భార్య, మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవి, కుమారుడు తేజస్వీయాదవ్‌లకు కూడా సమన్లు జారీ అయ్యాయి.
భారతీయ రైల్వే ఆహార, విహార సంస్థ (ఐఆర్‌సీటీసీ) హోటళ్ల లీజు సందర్భంగా నగదు అక్రమ చలామణి జరిగిందన్న ఆరోపణలపై అక్టోబరు 6వ తేదీన కోర్టుకు హాజరు కావాలని న్యాయమూర్తి సమన్లు జారీ చేశారు. జైలులో ఉన్న లాలూను కోర్టుకు తెచ్చేందుకు వీలుగా న్యాయమూర్తి ప్రొడక్షన్ వారెంట్ కూడా ఇచ్చారు.