Governor: గృహిణుల తాళిబొట్టు తొలగించడంపై గవర్నర్ నరసింహన్ తీవ్ర ఆగ్రహం!

  • వీఆర్వో పరీక్షల వేళ అధికారుల అత్యుత్సాహం
  • టీఎస్పీఎస్సీని వివరణ కోరిన గవర్నర్
  • పరీక్షా కేంద్రాన్ని బ్లాక్ లిస్టులో పెట్టామన్న సెక్రెటరీ

ఇటీవల తెలంగాణలో జరిగిన వీఆర్వో రాత పరీక్షల సమయంలో, వాటికి హాజరైన గృహిణులైన అభ్యర్థుల మెడల్లోని తాళిబొట్లను తొలగించాలని అధికారులు బలవంతం చేయడంపై గవర్నర్ నరసింహన్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మహిళా అభ్యర్థులు తమ పుస్తెల తాడు తొలగించేంత వరకూ పరీక్షా హాలులోకి అనుమతించ లేదని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. దీనికి బాధ్యులు ఎవరని ప్రశ్నించిన గవర్నర్, వెంటనే తనకు వివరణ ఇవ్వాలని తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ను ఆదేశించినట్టు తెలుస్తోంది. దీనిపై స్పందించిన టీఎస్పీఎస్సీ ఒక రిపోర్టును గవర్నర్ కార్యాలయానికి పంపుతూ, ఈ ఘటనకు పరీక్షా కేంద్రాల నిర్వాహకులే బాధ్యులని చెప్పినట్టు సమాచారం.

ఈ నిబంధనను తామేమీ విధించలేదని, మరింత సమగ్రంగా విచారించి నివేదిక ఇవ్వాలని కలెక్టరును ఆదేశించామని టీఎస్పీఎస్సీ కార్యదర్శి వాణీప్రసాద్‌ గవర్నర్ కు వివరణ ఇచ్చినట్టు తెలుస్తోంది. కేవలం నలుగురైదుగురితోనే తాళిబొట్లను తీయించినట్టు తెలిసిందని, ఆ పరీక్షా కేంద్రాన్ని బ్లాక్‌ లిస్టులో పెట్టాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశామని వివరణ ఇచ్చారు. కాగా, మెదక్‌ జిల్లా నర్సాపూర్‌ లోని పరీక్షా కేంద్రంలో మంగళసూత్రాలు తీసేంత వరకూ మహిళా అభ్యర్థులను పరీక్ష హాల్ లోకి అనుమతించలేదన్న సంగతి విదితమే.

  • Loading...

More Telugu News