Pune: యునీక్ ఐడియా... కార్డు స్వైప్ చేస్తే ఉండ్రాళ్లను ఇస్తున్న 'ఏటీఎం'!
- పుణెలో 'ఎనీ టైమ్ మోదక్' మెషీన్
- తయారు చేసిన సంజీవ్ కులకర్ణి
- ప్రసాదం పాడవకుండా చర్యలు
'ఏటీఎం'కు వినూత్న నిర్వచనం చెప్పాడో యువ టెక్కీ. ఓ ప్రత్యేకమైన కార్డును స్వైప్ చేయడం ద్వారా వినాయకునికి అత్యంత ప్రీతిపాత్రమైన ఉండ్రాళ్లను ఇచ్చే ఏటీఎంను పుణెకు చెందిన సంజీవ్ కులకర్ణి అనే యువకుడు సృష్టించాడు. 'ఎనీ టైమ్ మోదక్' పేరిట అందుబాటులోకి వచ్చిన ఈ ఏటీఎం ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తోంది. ఈ యంత్రం నుంచి వినాయకుడి ప్రసాదంగా భక్తులు భావించే ఉండ్రాళ్లను పొందవచ్చు.
సంప్రదాయాన్నీ, సాంకేతికతను అనుసంధానం చేస్తూ దీన్ని తయారు చేశామని, ఏటీఎంలో ముందుగానే ఏర్పాటు చేసిన మోదకాలను ప్రసాదంగా పొందవచ్చని ఈ సందర్భంగా సంజీవ్ తెలిపాడు. ప్రసాదం త్వరగా పాడవకుండా చర్యలు తీసుకున్నామని చెప్పాడు. ఈ ఏటీఎం పుణెలోని సహకార్ నగర్ లో తన వద్దకు వచ్చిన భక్తులకు ప్రసాదాలను పంచుతోంది.