Amaravati: నేడు ఒక్కరోజే అసెంబ్లీలో 10 బిల్లులను ప్రవేశపెట్టనున్న ఏపీ ప్రభుత్వం!

  • కీలక బిల్లులను నేడు ఆమోదించనున్న అసెంబ్లీ
  • పలు అంశాలపైనా ప్రశ్నోత్తరాల సమయంలో చర్చ
  • మండలిలోనూ వివిధ అంశాలపై కొనసాగనున్న చర్చ

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ముగింపు దశకు వచ్చిన తరుణంలో ప్రభుత్వం నేడు పది బిల్లులను అసెంబ్లీ ముందుకు తీసుకురానుంది. దుకాణాల ఏర్పాటు బిల్లు, సివిల్ కోర్టు సవరణ, ఉర్దూ విశ్వ విద్యాలయం సవరణ బిల్లు, మోటారు వాహనాల పన్ను, హౌసింగ్ బోర్డు సవరణ బిల్లు, వివాహాల నమోదు బిల్లుతో పాటు రెపియల్ కు సంబంధించి 2 బిల్లులు వీటిల్లో ఉన్నాయి.

కాగా, నేటి సమావేశాల్లో భాగంగా, చేనేత కార్మికులకు సబ్సిడీ మొత్తాల మంజూరీపై అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో చర్చ జరగనుంది. విశాఖ జిల్లా కంచరపాలెంలో ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణపై, ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాల మూసివేతపై, పేద, బలహీన వర్గాలకు వ్యవసాయ భూముల పంపిణీపై, బౌద్ద సర్క్యూట్ ప్రాజెక్టుల అభివృద్ధి, మద్దతు ధరలపై రైతులకు బోనస్, జగ్గయ్యపేట నియోజకవర్గంలో పారిశ్రామిక కారిడార్, జూనియర్ కళాశాలల్లో అధ్యాపకుల పోస్టుల భర్తీ, అనంతపురం జిల్లా బుక్కపట్నం చెరువులో అన్యాక్రాంత భూముల పరిహారం తదితర అంశాలపై చర్చలు జరగనున్నాయి. ఇదే సమయంలో 344 సెక్షన్ నిబంధనల కింద 1500 రోజుల గ్రామదర్శిని అమలు, ఆర్టీజీఎస్ నిర్వహణ తదితర అంశాలపై లఘు చర్చ సాగనుంది.

ఇక మండలి విషయానికి వస్తే అమరావతి బాండ్లు, దుబాయ్ కి విమాన సర్వీసులు, అమృత్ పథకం కింద నీటి కనెక్షన్లు, అమరావతికి కేంద్ర నిధులు, చంద్రన్న బీమా అమలు, వనం-మనం, అనావృష్టి పీడిత ప్రకాశం జిల్లాలో చెరువుల పునరుద్ధరణ, మద్యం విధానం అమలు తదితర అంశాలపై ప్రశ్నోత్తరాల సమయంలో చర్చ సాగనుంది. రాయలసీమలో కరవు పరిస్థితులపై అత్యవసర ప్రజా ప్రయోజన నోటీసు కింద చర్చ సాగనుంది. నిన్న వాయిడా పడిన గృహనిర్మాణ రంగంపై చర్చ నేడు కూడా కొనసాగనుంది.

  • Loading...

More Telugu News