HDFC: బ్యాంకు మేనేజర్ నుంచి లాకరు తాళం చోరీ.. కోటి రూపాయలతో క్యాషియర్ పరారీ!

  • రాత్రి వేళ దర్జాగా వెళ్లి బ్యాంకు తెరిపించిన క్యాషియర్
  • డబ్బు బ్యాగుల్లో సర్దుకుని బయటకు
  • మరో ముగ్గురితో కలిసి పరారీ

తన కుటుంబానికి అన్నం పెడుతున్న బ్యాంకుకే కన్నం వేశాడు ఓ క్యాషియర్. బ్యాంకు మేనేజర్‌‌కు తెలియకుండా లాకర్ తాళం తీసుకుని బ్యాంకుకు వెళ్లి కోటి రూపాయలు తీసుకుని పరారయ్యాడు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో జరిగిన ఈ ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది.

తడలోని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో కావలికి చెందిన కొత్తపల్లి పవన్‌కుమార్ క్యాషియర్‌‌గా పనిచేస్తున్నాడు. అదే బ్యాంకులో ఆపరేషన్ డిప్యూటీ మేనేజర్‌గా పనిచేస్తున్న వర్మతో పవన్‌కు స్నేహం ఉంది. ఆదివారం సాయంత్రం వర్మను కలిసేందుకు వెళ్లిన పవన్ కాసేపు మాట్లాడిన తర్వాత అతడి టేబుల్‌పై ఉన్న బ్యాంకు లాకర్ కీని కొట్టేశాడు. అనంతరం సాయంత్రం 8 గంటల ప్రాంతంలో బ్యాంకుకు వెళ్లి షట్టర్ తెరవమని సెక్యూరిటీ గార్డును ఆదేశించాడు. అనంతరం లోపలికి వెళ్లిన పవన్ కుమార్ లాకర్ తెరిచి అందులో ఉన్న కోటి రూపాయలను రెండు బ్యాగుల్లో సర్దుకుని బయటకు వచ్చాడు. అప్పటికే అక్కడ ఇద్దరు వ్యక్తులు కారుతో సిద్ధంగా ఉన్నారు. వారితో కలిసి కారెక్కి వెళ్లిపోయాడు.

లాకర్ తాళాలు కనిపించకపోవడంతో కంగారుపడిన వర్మ రాత్రి పదిగంటల సమయంలో పవన్‌కు ఫోన్ చేశాడు. అతడు ఫోన్ తీయకపోవడంతో అనుమానించాడు. సోమవారం ఉదయం బ్యాంకుకు వచ్చిన వర్మకు సెక్యూరిటీ గార్డు జరిగింది చెప్పాడు. దీంతో అనుమానించిన వర్మ.. తన వద్ద ఉన్న మరో తాళంతో లాకర్ తెరవగా నగదు మాయమైనట్టు గుర్తించాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పవన్ కుమార్ కోసం గాలిస్తున్నారు.

  • Loading...

More Telugu News