maruthi: సినిమా బిజినెస్ వద్దు బాబోయ్ అనుకున్నాను: దర్శకుడు మారుతి
- 'ఆర్య' సినిమాతో డబ్బులు బాగా వచ్చాయి
- 'హ్యాపీ' నుంచి తేడా కొట్టేసింది
- సినిమా బిజినెస్ వద్దు బాబోయ్ అనుకున్నాను
తాజాగా 'ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే' కార్యక్రమంలో దర్శకుడు మారుతి మాట్లాడుతూ, ఒక డిస్ట్రిబ్యూటర్ గా తనకి ఎదురైన అనుభవాలను గురించి ప్రస్తావించాడు. "నేను .. యూవీ క్రియేషన్స్ వంశీ .. బన్నీవాసు కలిసి డిస్ట్రిబ్యూషన్ చేసేవాళ్లం. ముందుగా ముగ్గురం కలిసి 'ఆర్య' సినిమా కొన్నాము. ఆ సినిమా మంచి లాభాలను తెచ్చిపెట్టింది. దాంతో ఆ తరువాత 'హ్యాపీ' సినిమాను కొంటే నష్టాలను తెచ్చిపెట్టింది.
'మహా' .. 'నందనవనం 120 కిలోమీటర్స్' సినిమాలతో డబ్బంతాపోయింది. ఇంకొద్దురా బాబోయ్ ఈ సినిమా బిజినెస్ మనకి వద్దు అనే స్థితికి వెళ్లిపోయాను. ఇండస్ట్రీలో గుర్తుపెట్టుకోవలసిన విషయం ఒకటుంది. ఇక్కడ ఎంత త్వరగా డబ్బులు వస్తాయో .. అంతే త్వరగా పోతాయి. నాలుగు హిట్ సినిమాల డబ్బులు ఒక్క ఫ్లాప్ సినిమాతో పోతాయి. ఈ విషయాన్ని ఎప్పటికప్పుడు గుర్తుపెట్టుకుంటూ అడుగులు వేయాలి .. లేదంటే తేడా కొట్టేస్తుంది" అని చెప్పుకొచ్చాడు.