Chandrababu: పాత కేసులు తిరగదోడుతున్నారు, ఓడిపోతామని తప్పుడు సర్వేలు చేయిస్తున్నారు: చంద్రబాబు నిప్పులు
- మంత్రులు, నేతలతో చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్
- ప్రజల కోసమే బాబ్లీపై నాడు పోరాడాను
- ఇప్పుడు పగ తీర్చుకోవాలని చూస్తున్నారు
- సొంత మీడియాలో వైకాపా తప్పుడు ప్రచారం
- చంద్రబాబు విమర్శలు
తనను ఇబ్బందులు పెట్టాలన్న ఉద్దేశంతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పాత కేసులను తిరగదోడుతోందని ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబునాయుడు నిప్పులు చెరిగారు. ఈ ఉదయం అసెంబ్లీ వ్యూహ కమిటీ బృందంతో సీఎం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ టెలీ కాన్ఫరెన్స్ లో మంత్రులు, ఉభయ సభల విప్ లు, పార్టీ బాధ్యులు పాల్గొనగా, వారిని ఉద్దేశించి చంద్రబాబు ప్రసంగించారు.
తన పేరిట జారీ అయిన నాన్ బెయిలబుల్ వారెంట్లను తెలుగు రాష్ట్రాల ప్రజలు తీవ్రంగా ఖండించారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. తెలుగువారు ఎక్కడున్నా సుభిక్షంగా ఉండాలన్న ఉద్దేశంతోనే బాబ్లీపై నాడు తాను పోరాడానని గుర్తు చేసుకున్నారు. తనపై పగ తీర్చుకోవాలన్న ఉద్దేశంతోనే కేంద్రం, మహారాష్ట్రలో ఉన్న బీజేపీ ప్రభుత్వాలు ఈ నోటీసులను ఇప్పించాయని ఆయన అన్నారు.
తనపై ఉన్న అక్కసుతో ఓడిపోతామని సర్వేలు చేయించి, వాటిని సొంత మీడియాలో రాసుకుంటున్నారని, రైతు వ్యతిరేక కథనాలు ఇస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇంకోవైపు శాంతి భద్రతలను దెబ్బతీయాలని కూడా చూస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. పలు వర్గాల ప్రజలను రెచ్చగొట్టే పనులు చేస్తున్నారని, వారిపై కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.
అసెంబ్లీ మరో మూడు రోజుల పాటు జరగనుందని గుర్తు చేసిన ఆయన, అర్థవంతమైన చర్చలతో ప్రజలను ఆకట్టుకోవాలని సూచించారు. ఐదు రోజుల పాటు లభించిన విరామ సమయంలో 'జలసిరికి హారతి' కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించామని గుర్తు చేశారు. జల సంరక్షణపై ప్రజలను మరింతగా చైతన్య పరచాలని సూచించిన చంద్రబాబు, 'ముఖ్యమంత్రి - యువనేస్తం' వెబ్ సైట్ కు మంచి స్పందన వస్తోందని చెప్పారు.
వర్షాభావంతో పంట దిగుబడులు తగ్గకుండా చూశామని, రాయలసీమ జిల్లాల్లోని చెరువులను నింపి నీటికొరత లేకుండా చేశామని చెప్పారు. రూ. 24,500 కోట్ల రుణ ఉపశమనంతో రైతులకు ఎంతో భరోసా లభించిందని అన్నారు. దేశంలోనే వ్యవసాయ వృద్ధి రేటులో ఏపీ అగ్రస్థానంలో ఉందని, రైతులంతా ప్రభుత్వానికి అండగా ఉండటాన్ని విపక్ష వైకాపా తట్టుకోలేకపోతోందని విమర్శలు గుప్పించారు.