West Godavari District: ఆకతాయిల వేధింపులు.. రైలులో నుంచి దూకిన దంపతులు!

  • దంపతులను వేధించిన బీహార్ యువకులు
  • వేధింపులు భరించలేక రైలు నుంచి దిగే ప్రయత్నంలో గాయాలు
  • నిందితులను విశాఖలో అదుపులోకి తీసుకున్న పోలీసులు

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు పవర్‌పేట రైల్వే స్టేషన్‌లో దారుణం జరిగింది. ఆకతాయిల వేధింపులు భరించలేని యువ దంపతులు వారి నుంచి తప్పించుకునేందుకు కదులుతున్న రైలు నుంచి దూకేశారు. ఈ ఘటనలో ఇద్దరూ తీవ్ర గాయాలపాలవగా, భార్య పరిస్థితి విషమంగా వుంది.

రైల్వే పోలీసుల కథనం ప్రకారం.. పశ్చిమ బెంగాల్‌లోని ఆలీపూర్‌ జిల్లా జయగామ్‌‌కు చెందిన వికాస్ రాయ్, పింకీరాయ్‌లు భార్యాభర్తలు. సికింద్రాబాద్‌లో ఓ ప్రైవేటు పరిశ్రమలో పనిచేస్తున్నారు. గర్భిణి అయిన తన భార్యను స్వగ్రామంలో దింపి వచ్చేందుకు ఆదివారం ఉదయం వికాస్ తన భార్యను తీసుకుని సికింద్రాబాద్‌లో గువాహటి ఎక్స్‌ప్రెస్ రైలులో జనరల్ బోగీలో ఎక్కాడు.

అదే బోగీలో ప్రయాణిస్తున్న బీహార్‌కు చెందిన యువకులు వీరిని వేధించడం మొదలుపెట్టారు. వారి వేధింపులు భరించలేని బాధిత జంట రైలు దిగాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో రైలు ఏలూరులోని పవర్‌పేట రైల్వేస్టేషన్‌కు చేరుకుంది. రైలు నెమ్మదిగా వెళ్తుండడంతో వికాస్ దిగేందుకు ప్రయత్నించాడు. ఇది గమనించిన నిందితులు పింకీని బలవంతంగా రైలు నుంచి కిందికి నెట్టారు. తీవ్ర గాయాలపాలైన ఇద్దరినీ రైల్వే పోలీసులు ఆసుపత్రిలో చేర్చారు. కాగా, పింకీ పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. నిందితులను విశాఖ రైల్వే స్టేషన్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  

West Godavari District
Eluru
Bihar
West Bengal
Railway police
Visakhapatnam District
  • Loading...

More Telugu News