Uttar Pradesh: చేతులే అంబులెన్సుగా మారినవేళ.. గర్భిణిని ఆసుపత్రికి ఎత్తుకెళ్లిన పోలీస్ అధికారి!
- ఉత్తరప్రదేశ్ లోని ఫరీదాబాద్ లో ఘటన
- నొప్పులు రావడంతో స్టేషన్ లోనే దిగిపోయిన దంపతులు
- అధికారి చొరవతో దక్కిన తల్లీబిడ్డల ప్రాణాలు
పోలీసులు అంటే కరుగ్గా ఉంటారనీ, సామాన్యులతో దురుసుగా ప్రవర్తిస్తారని చాలామంది అనుకుంటారు. కానీ ఉత్తరప్రదేశ్ లోని ఓ పోలీస్ అధికారి ఫ్రెండ్లీ పోలీసింగ్ కు సరికొత్త అర్థం చెప్పాడు. తన చొరవతో ఓ తల్లీబిడ్డల ప్రాణాలను కాపాడాడు. దీంతో పలువురు నెటిజన్లు ఆ అధికారిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
ఉత్తరప్రదేశ్ ఫరీదాబాద్ రైల్వే స్టేషన్ లో సోనూకుమార్ రాజోరా పోలీస్ అధికారిగా విధులు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫరీదాబాద్ జిల్లా బల్లభ్ గఢ్ గ్రామానికి చెందిన మహేశ్ తన భార్య భావన కాన్పు చేయించడం కోసం రైలులో బయలుదేరారు. రైలు మధుర కంటోన్మెంట్ వద్దకు చేరుకోగానే ఆమెకు నొప్పులు మొదలయ్యాయి. దీంతో స్టేషన్ లో దిగిపోయిన మహేశ్ సాయం చేయాలని పలువురిని అర్థించాడు. ఎవ్వరూ ముందుకు రాకపోవడంతో పోలీస్ అధికారి సోనూకుమార్ వద్దకు వెళ్లాడు. వెంటనే స్పందించిన సోనూ కుమార్ అక్కడకు వచ్చి అంబులెన్సుకు ఫోన్ చేశాడు.
వాహనం అందుబాటులో లేదని జవాబు రావడంతో భావనను చేతులతో ఎత్తుకుని 100 మీటర్ల దూరంలో ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అక్కడ వెంటనే వైద్యులు చికిత్స ప్రారంభించడంతో భావన పండంటి మగపిల్లాడికి జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లీబిడ్డల ఆరోగ్యం స్థిరంగా ఉంది. కాగా సోనూకుమార్ కు ఈ సందర్భంగా మహేశ్-భావన దంపతులు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ విషయమై సోనూకుమర్ మాట్లాడుతూ.. ‘నేను నా విధిని మాత్రమే నిర్వర్తించాను. అంబులెన్సు లేకపోవడంతో ఆమెను ఆసుపత్రి వరకూ మోసుకెళ్లాను’ అని సోనూకుమార్ తెలిపారు. కాగా, ఓ పోలీస్ అధికారిగా సోనూకుమార్ స్పందించిన తీరుపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.