Miryalaguda: పాతికేళ్ల క్రితం నీలిచిత్రాలు తీసి పట్టుబడ్డ శ్రవణ్... స్కూటర్ పై తిరుగుతూ కోటీశ్వరుడిగా మారిన మారుతీరావు... అన్నదమ్ముల గత చరిత్ర!

  • అన్నదమ్ములది ఆది నుంచి నేరచరిత్రే
  • పాతికేళ్ల క్రితమే జైలుకెళ్లిన శ్రవణ్
  • అధికారుల అండతో కబ్జాలు
  • ఏళ్ల వ్యవధిలో కోట్ల సంపాదన

తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం సృష్టించిన పెరుమాళ్ల ప్రణయ్ పరువు హత్యకేసులో ఏ1 నిందితుడు మారుతీరావు, అతని సోదరుడు, ఇదే కేసులో ఏ2 నిందితుడిగా ఉన్న శ్రవణ్ లది ఆది నుంచీ నేరచరిత్రేనని తెలుస్తోంది. దాదాపు 25 ఏళ్ల క్రితం మిర్యాలగూడలోని ఓ లాడ్జిలో నీలిచిత్రాలను శ్రవణ్ చిత్రీకరిస్తుండగా, పోలీసులు అరెస్ట్ చేసి కేసులు పెట్టారు.

అదే సమయంలో ఓ చిన్న స్కూటర్ పై నగరంలో తిరుగుతూ, మారుతీరావు కిరోసిన్ దందా చేస్తుండేవాడు. అనంతర కాలంలో రెవెన్యూ అధికారులను అడ్డుపెట్టుకుని, డివిజన్ పరిధిలోని ప్రభుత్వ భూములను ఆక్రమిస్తూ, వాటిని తన పేరిట మార్చుకుంటూ, కబ్జాదారుడిగా మారి కోట్ల రూపాయల ఆస్తులను సంపాదించాడు. రెండు దశాబ్దాల క్రితం మిర్యాలగూడలో తహసీల్దారుగా పనిచేసి పదవీ విరమణ చేసిన ఓ వ్యక్తి సాయంతో ప్రభుత్వ భూములను గుర్తించడం, వాటిని ఆక్రమించుకోవడం చేస్తుండేవాడని తెలుస్తోంది.

ఇటీవల మిర్యాలగూడ శివార్లలోని 626 సర్వే నంబర్ లో 20 కుంటల భూమిని మారుతీరావు ఆక్రమించగా, షెడ్యూల్డ్ కులాల సంఘాలు తీవ్ర నిరసన తెలియజేయడంతో, ప్రభుత్వం ఆ భూమిని స్వాధీనం చేసుకుంది. 716, 756 సర్వే నంబర్ లలోని ప్రభుత్వ భూములను కూడా బినామీల పేరిట మారుతీరావు ఆక్రమించినట్టు ఆరోపణలు ఉన్నాయి. తమ్ముడి సాయంతో అద్దంకి - నార్కట్ పల్లి రహదారిపై భూమిని ఆక్రమించి, ఓ గది వేసి కబ్జా చేసినట్టు తెలుస్తోంది. స్థానిక కూరగాయల మార్కెట్, పాత బస్టాండ్ ప్రాంతంలో మునిసిపాలిటీకి చెందిన దుకాణాలను ఖాళీ చేయించి, అక్కడి తన ఖాళీ స్థలంలో భారీ భవంతిని నిర్మించుకున్నా, అధికారులు చూసీ చూడనట్టు ఉండిపోయారన్న ఆరోపణలు ఉన్నాయి.

ఇక మిర్యాలగూడలోని ప్రజా ప్రతినిధులతో మంచి సంబంధాలను నడిపే మారుతీరావు, టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత కేటీఆర్ సమక్షంలో గులాబీ కండువాను కప్పుకున్నారు. తనకంటూ ఓ వర్గాన్ని పెంచి పోషించాడు. ఇప్పుడు కుమార్తెను ప్రేమించి పెళ్లాడిన పాపానికి ఓ యువకుడిని హత్య చేయించి వార్తల్లోకి ఎక్కారీ సోదరులు.

  • Loading...

More Telugu News