Telangana: మరోసారి 'తెలంగాణ మహాకూటమి' సమావేశం!
- నేడు సమావేశం కానున్న నేతలు
- సీట్ల సర్దుబాటుపైనే చర్చ
- నేతల మధ్య పట్టువిడుపులపై కొత్త చర్చ
తెలంగాణలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ ను గద్దె దించడమే లక్ష్యంగా కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్ తదితర పార్టీల కలయికలో ఏర్పడిన మహాకూటమి నేడు మరోసారి సమావేశం కానుంది. ఇప్పటికే తమ మధ్య పొత్తు కుదిరిందని సంయుక్త సమావేశంలో ప్రకటించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎల్ రమణ, కోదండరామ్ తదితర నేతలు, నేటి సమావేశంలో సీట్ల సర్దుబాటుపై చర్చించనున్నారు.
గెలిచే సీట్లను వదులుకోవద్దని కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీ నుంచి, టీడీపీకి చంద్రబాబు నుంచి సంకేతాలు అందగా, నేతల మధ్య పట్టువిడుపు ధోరణి ఏ మేరకు ఉంటుందన్న విషయం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కూటమిలోని మిగతా అన్ని పార్టీలకూ కలిపి 25 సీట్లను మాత్రమే ఇస్తామని కాంగ్రెస్ చెబుతుండగా, తమకు 35 సీట్ల వరకూ కావాలని టీడీపీ అంటోంది. కోదండరామ్ సైతం తమ పార్టీకి 25 సీట్లయినా కావాలని డిమాండ్ చేస్తుండటం కాంగ్రెస్ ను కొంత ఇరుకున పెడుతోంది. ఈ నేపథ్యంలో నేటి సమావేశంలో ఎటువంటి నిర్ణయాలు వెలువడతాయన్న విషయమై సర్వత్ర ఆసక్తి నెలకొంది.