Telangana: నయీం గ్యాంగ్ తో ప్రణయ్ హత్యకు కుట్ర.. నా తండ్రిని ఉరి తీయండి!: అమృత
- మా నాన్న ప్రణయ్ పై నిఘా పెట్టాడు
- మేం ఎక్కడికి వెళ్లినా క్షణాల్లో తెలిసిపోయేది
- ఆసుపత్రిలో ఉండగా ఆయన ఫోన్ చేస్తే ఎత్తలేదు
తన భర్త ప్రణయ్ ను తన తండ్రి మారుతీరావే హత్య చేయించాడని అతని భార్య అమృత తెలిపింది. నయీం గ్యాంగ్ తో ప్రణయ్ ను హత్య చేయించేందుకు కుట్ర పన్నాడని వెల్లడించింది. తాను పుట్టింటికి వెళ్లబోనని స్పష్టం చేసింది. ప్రస్తుతం మిర్యాలగూడలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలు మీడియాతో మాట్లాడింది. తానెక్కడికి వెళ్లినా తండ్రికి క్షణాల్లో తెలిసిపోయేదని అమృత తెలిపింది. తన కళ్ల ముందే భర్తను నరికి చంపేశారని భోరున విలపించింది. ప్రణయ్ హత్యకు కుట్ర పన్నిన తన తండ్రిని ఉరి తీయాలని డిమాండ్ చేసింది.
ప్రణయ్ ను చంపేస్తే తాను పుట్టింటికి వచ్చేస్తానని తండ్రి భావించాడని అమృత చెప్పింది. తన ప్రేమ వ్యవహారం తెలిసిన వెంటనే బాబాయ్ శ్రవణ్ తనను డంబెల్ తో కొట్టాడనీ, కిందపడేసి తన్నాడని వెల్లడించింది. అప్పట్లో ప్రణయ్ తో మాట్లాడితే చంపేస్తానని తండ్రి కూడా బెదిరించాడని వాపోయింది. దీంతో తామిద్దరం హైదరాబాద్ లోని ఆర్యసమాజ్ కు వెళ్లి రహస్యంగా పెళ్లి చేసుకున్నామని అమృత తెలిపింది. వివాహమైన తర్వాత తమకు వేధింపులు కొనసాగాయని పేర్కొంది.
తాను నెల తప్పినట్లు తెలియగానే వెంటనే అబార్షన్ చేసుకోవాలని తండ్రి మారుతీరావు ఒత్తిడి చేశాడని ఆమె వెల్లడించింది. ఈ విషయాన్ని తల్లికి చెప్పవద్దని హెచ్చరించినట్లు అమృత మీడియాకు తెలిపింది. కానీ రెండు నెలల క్రితం తల్లికి ఈ విషయం చెప్పానంది. తన తల్లి అప్పుడప్పుడూ రహస్యంగా ఫోన్ లో మాట్లాడేదని పేర్కొంది. తాను ప్రణయ్ తో కలిసి ఎక్కడికి వెళ్లినా తండ్రికి క్షణాల్లో తెలిసిపోయేదనీ, తామిద్దరం శుక్రవారం ఆసుపత్రిలో ఉండగా ఆయన ఫోన్ చేశారని అమృత తెలిపింది. తాను ఎక్కడున్నానో తెలిసిపోతుందన్న భయంతో ఫోన్ లిఫ్ట్ చేయలేదని చెప్పింది.
తాను ప్రణయ్, వాళ్ల అమ్మతో కలసి ఆసుపత్రి నుంచి వస్తుండగా దాడి చోటుచేసుకుందని అమృత తెలిపింది. ప్రమాదం తర్వాత తన తండ్రికి ఫోన్ చేయగా మాటలు వినిపించడం లేదంటూ కాల్ కట్ చేశారని వెల్లడించింది. డీఎస్పీకి ఫోన్ చేసినా ఆయన లిఫ్ట్ చేయలేదని వాపోయింది. తాను నిన్న ఇంట్లో ఆగిపోయినా ప్రణయ్ బతికేవాడని తీవ్రంగా రోదించింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అమృతను గుత్తా సుఖేందర్ రెడ్డి, ఇతర నేతలు పరామర్శించారు.