maruthi: నేను అరటిపండ్లు అమ్మిన రోజులున్నాయి: దర్శకుడు మారుతి
- మా నాన్నది అరటిపండ్ల బండి
- జిలేబి తిని కడుపు నింపుకున్నాను
- అదే రోడ్లో ఖరీదైన కార్లో తిరుగుతున్నాను
ఆరంభంలో మారుతి కొత్త నటీనటులతో యూత్ కి నచ్చే సినిమాలు మాత్రమే చేస్తూ వచ్చాడు. ఆ తరువాత దర్శకుడిగా తాను ఎదగడానికి స్టార్ హీరోలతో సినిమాలు చేయవలసిన అవసరాన్ని గుర్తించాడు. అలాగే తన సినిమాలు విజయాలను అందుకోవాలంటే .. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా థియేటర్స్ కి రావలసి ఉంటుందని గ్రహించాడు. అలా ఆ మార్గంలో తన ప్రయాణాన్ని ప్రారంభించిన మారుతి, తాజాగా 'శైలజా రెడ్డి అల్లుడు' సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు.
ఆయన తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన గురించిన విషయాలను ప్రస్తావించాడు. " మా నాన్నది అరటిపండ్ల బండి .. ఆయన చాలా కష్టాలు పడ్డాడు. నేను కూడా అరటిపండ్లు అమ్మిన రోజులున్నాయి. ఆ తరువాత ఆఫీస్ బాయ్ గా పనిచేశాను. జేబులో వున్న రెండు రూపాయలతోనే జిలేబి తిని కడుపు నింపుకున్న సందర్భాలు వున్నాయి. అదే రోడ్డులో నేను ఇప్పుడు ఖరీదైన కార్లో తిరుగుతున్నాను. నేను ఈ స్థాయికి చేరుకుంటానని నేనే ఊహించలేదు" అని చెప్పుకొచ్చాడు.