Telangana: మరికాసేపట్లో హైదరాబాద్ కు చేరుకోనున్న అమిత్ షా!
- ఎన్నికల శంఖారావం మోగించనున్న బీజేపీ చీఫ్
- మధ్యాహ్నం 3.30 గంటలకు బహిరంగ సభ
- లాల్ దర్వాజా అమ్మవారి ఆలయంలో పూజలు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గణనీయమైన సీట్లను దక్కించుకుని సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్న బీజేపీ ప్రచార పర్వాన్ని మొదలుపెట్టింది. ఇందులో భాగంగా ఈ రోజు బీజేపీ జాతీయ అధ్యక్షుడు తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా పలు కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు బహిరంగ సభతో ఎన్నికల శంఖారావాన్ని మోగించనున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 11.30 గంటలకు షా ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు.
అనంతరం ఎన్టీఆర్ స్టేడియం సమీపంలోని రోడ్డులో ‘స్వచ్ఛతా హీ సేవా’ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఇది అక్టోబర్ 2 వరకూ కొనసాగుతుంది. ఆ తర్వాత పార్టీ ప్రధాన కార్యాలయానికి చేరుకుని మీడియా సమావేశంలో ఆయన పాల్గొంటారు. ఈ సందర్భంగా బీజేపీ మేనిఫెస్టోతో పాటు కార్యాచరణ, ప్రచార వ్యూహాలపై పార్టీ నేతలకు షా దిశానిర్దేశం చేయనున్నారు.
సమావేశం అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు షా లాల్ దర్వాజా అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహిస్తారు. మధ్యాహ్నం 3.30 గంటలకు మహబూబ్ నగర్ లో బీజేపీ శంఖారావ సభలో పాల్గొంటారు. అనంతరం సాయంత్రం 6.30 గంటలకు మరోసారి బీజేపీ నేతలతో షాద్ నగర్ లో సమావేశం అవుతారు. కాగా, షా కు ఆహ్వానం పలికేందుకు బీజేపీ నేతలు బేగంపేటకు చేరుకున్నారు.