apple: ఐఫోన్ ప్రియులకు శుభవార్త.. భారీగా ధరలు తగ్గించిన యాపిల్!
- కొత్త మోడల్స్ ను ఆవిష్కరించిన టెక్నాలజీ దిగ్గజం
- అల్యూమినియం డిజైన్, డ్యుయెల్ సిమ్ ఫీచర్లు
- ఈ నేపథ్యంలో పాత మోడల్స్ పై ధరలు తగ్గిస్తూ నిర్ణయం
అమెరికా టెక్నాలజీ దిగ్గజం యాపిల్ తాజాగా ఐఫోన్ X ఆర్, Xఎస్, Xఎస్ మ్యాక్స్‌ల ప్రీమియం ఫోన్లను మార్కెట్ లోకి విడుదల చేసింది. డ్యుయెల్ సిమ్, అల్యూమినియం గ్లాస్ డిజైన్, నాచ్ డిస్ ప్లే వంటి అత్యాధునిక ఫీచర్లతో యాపిల్ ఈ ఫోన్లను తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే మార్కెట్ లో ఉన్న తమ ఉత్పత్తుల ధరలను భారీగా తగ్గిస్తూ యాపిల్ నిర్ణయం తీసుకుంది.
ఐఫోన్ 6ఎస్
ఐఫోన్ 6ఎస్ ఫోన్ ధరలను యాపిల్ భారీగా తగ్గించింది. ఈ సిరీస్ లో 32 జీబీ మోడల్ ధరను రూ.52,240 నుంచి రూ.34,900కు తగ్గించింది. ఇక 6ఎస్ ప్లస్ 128 జీబీ వేరియంట్ ధరను రూ.61,450 నుంచి రూ.44,900కు తగ్గించింది.
యాపిల్ ఐఫోన్7
ఐఫోన్ 7 32జీబీ వేరియంట్ ధరను యాపిల్ రూ.52,370 నుంచి రూ.39,900కు తగ్గించింది. అలాగే ఈ సిరీస్ లో 128జీబీ ధరను కూడా రూ.61,560 నుంచి రూ.49,900కు తగ్గించింది.
యాపిల్ ఐఫోన్ 8
ఐఫోన్ 8 ప్లస్ ధరను సైతం యాపిల్ తగ్గించింది. 64జీబీ స్టోరేజ్ ఉన్న ఐఫోన్ 8 ఇకపై రూ.69,900కే లభించనుంది. గతంలో దీని ధర రూ.77,560గా ఉండేది. ఇదే సిరీస్ లో 256జీబీ స్టోరేజ్ సామర్థ్యం ఉన్న ఫోన్ ధరను రూ.91,110 నుంచి రూ.84,900కు తగ్గించింది. ఐఫోన్ 8 టాప్ ఎండ్ మొబైల్ ధరను రూ.81,500 నుంచి రూ.74,900కు తగ్గించింది.
యాపిల్ ఐఫోన్ ఎక్స్
ఐఫోన్ ఎక్స్ 64జీబీ వేరియంట్ ఇప్పటివరకూ రూ.95,390గా ఉండగా తాజాగా ఇది కేవలం రూ.91,900కే లభ్యం కానుంది. అలాగే ఈ సిరీస్ లో 256 జీబీ స్టోరేజ్ ఉన్న ఫోన్ ధర రూ.1,08,930 నుంచి రూ.1,06,900కు తగ్గింది.