Chandrababu: నేడు శ్రీశైలంలో జలహారతి: హాజరుకానున్న ముఖ్యమంత్రి చంద్రబాబు
- శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామిలను దర్శించుకోనున్న చంద్రబాబు
- అనంతరం జలాశయం వద్దకు చేరనున్న సీఎం
- సున్నిపెంటలో బహిరంగ సభ
సెప్టెంబర్ రెండోవారానికే నిండుకుండలా దర్శనమిస్తున్న శ్రీశైలం రిజర్వాయర్ వద్ద ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం జలహారతి కార్యక్రమం నిర్వహిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఇందుకోసం సీఎం ఉదయం పది గంటలకు సున్నిపెంటకు హెలికాప్టర్‌లో చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో శ్రీశైలం వెళ్లి శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామిలను దర్శించుకుంటారు.
అనంతరం జలాశయం వద్దకు చేరుకుని జలహారతి ఇవ్వనున్నారు. చివరిలో సున్నిపెంటలోని ప్రాజెక్టు ఉన్నత పాఠశాల మైదానంలో జరిగే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. ముఖ్యమంత్రి రాక సందర్భంగా అన్నిశాఖలు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నాయి. నల్లమలలో పోలీసులు మోహరించారు. సీఎం పర్యటించనున్న ప్రాంతాల్లో బాంబ్ స్క్వాడ్‌లు విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నాయి.