Tirumala: తానే స్వయంగా వచ్చినా గైర్హాజరైన ఎమ్మెల్యే... ఆరా తీసిన చంద్రబాబు!
- తిరుమలలో ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు
- పట్టు వస్త్రాలు సమర్పించిన చంద్రబాబు
- కార్యక్రమానికి హాజరుకాని తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మ
- పిలిపించి మాట్లాడాలని అమర్ నాథ్ కు సూచించిన బాబు
తిరుమల శ్రీ వెంకటేశ్వరుని బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబునాయుడు పట్టు వస్త్రాలతో కుటుంబ సమేతంగా వచ్చి, స్వామికి సమర్పించిన వేళ, తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మ గైర్హాజరు కావడం కలకలం రేపింది. స్థానిక ఎమ్మెల్యే హోదాతో పాటు, ప్రొటోకాల్ లో భాగంగానూ ఆమెకు ఆహ్వానం వెళ్లినా ఆమె రాలేదట.
దీంతో ఆమె ఎందుకు రాలేదు? ఏం జరిగింది? బ్రహ్మోత్సవాలకు ఆమె ఎందుకు దూరంగా ఉన్నారు? ఆమె అసంతృప్తికి కారణాలేంటి? అని ఆరా తీసిన చంద్రబాబు, సుగుణమ్మతో మాట్లాడాలని మంత్రి అమర్ నాథ్ రెడ్డికి సూచించారు. ఆమెను తిరుమలకు పిలిపించి మాట్లాడాలని ఆదేశించారు. కాగా, తిరుమలలో మహా సంప్రోక్షణ జరుగుతున్న వేళ, ఎమ్మెల్యే హోదాలో వెళ్లిన సుగుణమ్మను లోనికి అనుమతించని సంగతి తెలిసిందే. దీనిపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసిన ఆమె, టీటీడీ అధికారుల తీరుపై నిప్పులు చెరిగారు కూడా. ఆ కారణంతోనే నేటి బ్రహ్మోత్సవాలకూ సుగుణమ్మ దూరంగా ఉన్నట్టు తెలుస్తోంది.