Medicines: సారిడాన్ సహా 328 రకాల ఔషధాలపై నిషేధం విధించిన కేంద్రం
- జలుబు, దగ్గు, నొప్పి నివారణ మాత్రలు ఇకపై ఎక్కడా తయారీ, అమ్మకాలు జరిపేందుకు వీల్లేదన్న కేంద్రం
- ఎఫ్డీసీ మందులు రోగికి ఏ విధమైన మేలూ చేయడం లేదని వెల్లడి
- 328 రకాల ఎఫ్డీసీలు ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టేవేనని స్పష్టం
ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్ (ఎఫ్డీసీ) ఔషధాలను వాడటం వల్ల రోగికి ఏ విధమైన మేలూ జరగడం లేదని తేలడంతో, వీటి వాడకం నుంచి ప్రజలను రక్షించేందుకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఓ నిర్ణయం తీసుకుంది. నొప్పి నివారణ మాత్ర సారిడాన్ సహా దాదాపు 300 రకాల ఎఫ్డీసీ మందులపై నిషేధం విధించింది. ఎఫ్డీసీ ద్వారా రూపొందే జలుబు, దగ్గు, నొప్పి నివారణ మాత్రలు ఇకపై ఎక్కడా తయారీ, అమ్మకాలు జరిపేందుకు వీల్లేదని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది.
ఎఫ్డీసీ విధానంలో తయారైన మందుల్లో వైద్య పరమైన ప్రమాణాలేవీ పాటించట్లేదని దేశ ఔషధ సలహా విభాగమైన డ్రగ్ టెక్నికల్ అడ్వైజరీ బోర్డ్ వెల్లడించింది. 328 రకాల ఎఫ్డీసీలు ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టేవేనని ఈ బోర్డ్ వెల్లడించింది. ఈ విషయమై భారతీయ వైద్య సంఘం మాజీ అధ్యక్షుడు కేకే అగర్వాల్ స్పందించారు.
సాధారణ ఔషధ మాత్రల తయారీ దారులు కేంద్రం నుంచి లైసెన్స్ పొందుతున్నారని.. కాంబినేషన్ ఔషధ తయారీదారులు రాష్ట్రాల స్థాయిలో అనుమతి తీసుకుంటున్నారని వెల్లడించారు. తయారు చేసేది సరైన ఔషధమే అయితే సదరు సంస్థ ఔషధ నియంత్రణ సంస్థను సంప్రదించి కొత్త లైసెన్స్ పొందాలని అగర్వాల్ సూచించారు.