mayavathi: కాంగ్రెస్ కు షాక్ ఇచ్చిన మాయావతి.. వేరే కారణాలు ఉన్నాయంటున్న కాంగ్రెస్ నేతలు!
- పెట్రో ధరలపై మాయావతి విమర్శలు
- యూపీయేపై కూడా ధ్వజం
- భారత్ బంద్ కు దూరం
తమతో కలసి వచ్చే పార్టీలన్నింటితో 2019 ఎన్నికల కోసం మహా కూటమిని ఏర్పాటు చేయాలనే భావనలో ఉన్న కాంగ్రెస్ కు కీలక భాగస్వామి అయిన బీఎస్పీ చీఫ్ మాయావతి షాక్ ఇచ్చారు. ఆకాశాన్నంటుతున్న పెట్రోల్ ధరలపై మాట్లాడుతూ... బీజేపితో పాటు కాంగ్రెస్ పార్టీని కూడా విమర్శించారు.
ఇంధన ధరలు ప్రభుత్వ పరిధిలో లేకుండా గతంలో యూపీయే ప్రభుత్వం చేతులు దులిపేసుకుందని...ఇప్పుడు ఎన్డీయే ప్రభుత్వం కూడా అదే విధానాన్ని కొనసాగిస్తోందని మండిపడ్డారు. ఎన్డీయే ప్రభుత్వం డీజిల్ పై కూడా నియంత్రణను వదిలేయడంతో పేదలపై మరింత భారం పడిందని అన్నారు. 10వ తేదీన ప్రతిపక్ష పార్టీలు నిర్వహించిన భారత్ బంద్ కు కూడా మాయావతి దూరంగా ఉన్నారు.
మాయావతి వ్యాఖ్యల వెనుక అసలైన కారణాలు వేరే ఉన్నాయని కొందరు కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. రాజస్థాన్, చత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్ ఎన్నికల్లో మహాకూటమిలో మరిన్ని సీట్లను డిమాండ్ చేసేందుకే మాయావతి ఈ ఎత్తుగడ వేశారని అంటున్నారు.