Ganesh Chaturdi: అమెరికాలోనూ మొదలైన గణేశ్ ఉత్సవాలు!
- డాలస్‌లో 50 మండపాలు
- 9 రోజులపాటు పూజలు
- ప్రవాస తెలుగు కుటుంబాల్లో ఉత్సాహం
హిందువుల తొలి పండుగ అయిన వినాయక చవితి సంబరాలు అమెరికాలోనూ మొదలయ్యాయి. డాలస్‌లో స్థిరపడిన తెలుగు కుటుంబాలు పండుగను ఘనంగా చేసుకునేందుకు ఏర్పాట్లు చేశాయి. ప్రిస్క్‌లో ఇప్పటికే 50 మండపాలు ఏర్పాటు చేశారు. పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకుని మట్టి వినాయకులను ప్రతిష్ఠించేందుకు సర్వం సిద్ధం చేసినట్టు ప్రవాస తెలుగు కుటుంబాలు తెలిపాయి. ఐదు నుంచి తొమ్మిది రోజులపాటు పూజలు నిర్వహించనున్నట్టు పేర్కొన్నాయి.
అనంతరం హిందూ సంప్రదాయం ప్రకారం విగ్రహాలను నిమజ్జనం చేయనున్నట్టు డాలస్‌లో స్థిరపడిన హైదరాబాద్‌కు చెందిన గంగసాని ఆదిత్య తెలిపారు. భక్తి శ్రద్ధల మధ్య పూజలు నిర్వహిస్తామని, తొమ్మిదో రోజు ఆటపాటలు, డప్పు వాయిద్యాలతో రే రాబర్ట్స్ లేక్, వైట్ రాక్ లేక్, లూయిస్ విల్లే లేక్‌లలో నిమజ్జనం చేయనున్నట్టు తెలిపారు.