Pawan Kalyan: ఎస్సీ వర్గాలు ఉద్యోగాలిచ్చే స్థాయికి ఎదగాలి: పవన్ కల్యాణ్
- వంద మంది ఎస్సీ ఎంటర్ ప్రెన్యూర్స్ ని తయారుచేస్తా
- టీడీపీ, వైసీపీలు ఇలా ఎంతమందిని తయారు చేశారు?
- దెబ్బతిన్నా సరే, నేను పోరాడతా
ఎస్సీ వర్గాల వాళ్లు ఉద్యోగాలు చేసే స్థాయి నుంచి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలని తాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన వివిధ పార్టీల నాయకులు ఈరోజు జనసేన పార్టీలో చేశారు. హైదరాబాద్ లోని జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ కల్యాణ్ సమక్షంలో వీరు పార్టీ కండువాలు కప్పుకున్నారు.
అనంతరం, పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, ఎస్సీ వర్గాలు ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలంటే కావాల్సింది ఎంటర్ ప్రెన్యూర్ షిప్ అని అభిప్రాయపడ్డారు. ఎస్సీలలో కొంత మంది పరిశ్రమలు స్థాపించాలనుకుంటే వాళ్లను అర్థం చేసుకుని, వాళ్లను ముందుకు తీసుకెళ్లే ప్రభుత్వాలు లేకపోతే వాళ్లకు గుర్తింపు ఎలా వస్తుందని ప్రశ్నించారు. మరి, ఎస్సీలు ఏ విధంగా పైకెళతారు? అని ప్రశ్నించారు.
ఆయా కులాల్లో కూడా ఏదైనా సాధించిన వాళ్లుంటే, వాళ్లను చూసి స్ఫూర్తి పొంది, ఎదిగే అవకాశాలు ఉంటాయని అన్నారు. ‘జనసేన’ ముఖ్యంగా కోరుకునేది.. ఎస్సీ వర్గాలకు సంబంధించి ఎంటర్ ప్రెన్యూర్స్ ను గుర్తించి, వంద మంది ఎస్సీ ఎంటర్ ప్రెన్యూర్స్ ని తయారుచేస్తానని తాను మాటిస్తున్నానని పవన్ పేర్కొన్నారు. టీడీపీ గానీ, వైసీపీ గానీ ఇప్పటివరకు ఎంతమంది ఎస్సీ పారిశ్రామికవేత్తలను అభివృద్ధి చేశారో ఒకసారి ఆలోచించాలని అన్నారు.
‘నా మనస్సాక్షికి సమాధానం చెప్పుకోవడానికే నేను రాజకీయాల్లోకి వచ్చాను. గెలుపు రావచ్చు! ఓటమి రావచ్చు! నేను ఒకటి మాత్రం నమ్ముతా.. నేను చేగువేరా నుంచి నేర్చుకున్నది పోరాటం చేయడం. దెబ్బతిన్నాసరే, పోరాటం చేసేందుకు నేనెప్పుడూ సిద్ధంగా ఉంటాను. నా తుదిశ్వాస వరకు పోరాటం ఆగదు’ అని పవన్ అన్నారు.